లక్నో : దేశంలో ఉపాధి రహిత పరిస్థితికి నార్త్ ఇండియన్స్ కారణమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా బరేలిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉద్యోగాలకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. పలు రంగాల్లో ఉద్యోగావకాశాలున్నా ఉత్తర భారతీయుల్లో నైపుణ్యాలు, సామర్థ్యాలు కొరవడటమే అసలు సమస్యని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కార్మిక మంత్రిత్వ శాఖ పనితీరును గమనిస్తున్న క్రమంలో పరిస్థితి గురించి తనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు.
ఆర్థిక మందగమనంపై తమకు ఆందోళన ఉన్నా దేశంలో ఉపాథి అవకాశాలకు ఢోకా లేదని చెప్పుకొచ్చారు. పనిలోపనిగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ నేత ఆజం ఖాన్‌లపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అఖిలేష్ అధికారం కోల్పోవడంతో అసహనంలో ఉన్నారని, ఇక రాంపూర్ ప్రజలు ఆజం ఖాన్ వంటి నేతను లోక్‌సభకు ఎన్నుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆటోమొబైల్ సహా పలు రంగాల్లో ఉద్యోగాలు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment