సాక్షి, న్యూఢిల్లీ : విదేశాలకు వెళుతున్న భారతీయ యువత మన సంస్కృతి, సంప్రదాయాల గురించి పెద్దలు వివరించకపోవడంతో అక్కడ బీఫ్ తినడం మొదలుపెడుతున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘స్కూల్స్‌లో భగవద్గీతను కచ్చితంగా బోధించేలా చర్యలు చేపట్టాలి..మన పిల్లలను మిషనరీ స్కూల్స్‌కు పంపితే అక్కడ ఐఐటీ శిక్షణతో ఇంజనీర్లవుతూ విదేశాలకు వెళుతున్నారు. వారిలో చాలా మంది బీఫ్ తినడానికి అలవాటుపడుతున్నార‘ని వ్యాఖ్యానించారు. వారికి మన సంస్కృతి, సంప్రదాయాల గురించి మనం బోధించకపోవడమే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత పిల్లలు తమను సరిగ్గా చూసుకోవడం లేదని పెద్దలు వాపోతున్నారని అన్నారు. బెగుసరైలో భగవద్గీతకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొంటూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో భగవద్గీతను చిన్నారులకు బోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాము చేపట్టిన సర్వేలో 100 ఇళ్లకు గాను కేవలం 15 ఇళ్లలోనే హనుమాన్ చాలీసా, భగవద్గీత, రామాయణ పుస్తకాలు ఉన్నాయని వెల్లడైందని చెబుతూ జరుగుతున్న పరిణామాలకు మనం పిల్లల్ని నిందించలేమని చెప్పుకొచ్చారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటేనే మన దేశం మనుగడ సాధిస్తుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment