
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలు పర్యావరణ సమతుల్యం పాటించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి విఙ్ఞప్తి చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కఠిన చట్టాలు తీసుకువస్తామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పర్యావరణ సమతుల్యాన్ని పాటించాల్సిన ఆవశ్యకతను వివరించారు.
కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత జి.కిషన్‌రెడ్డి విజయబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు.