
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తరపున వాదిస్తున్న న్యాయవాది మహేంద్ర సింగ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందుగానే ఊహించారు. రోడ్డు ప్రమాదం జరగడానికి వారం రోజుల ముందే తుపాకీ లైసెన్స్ కోసం ఉన్నావ్ జిల్లా కలెక్టర్‌కు ఆయన లేఖ రాసిన తాజాగా వెలుగులోకి వచ్చింది. భవిష్యత్తులో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున తనకు తక్షణమే తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని జూలై 15న కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో తుపాకీ లైసెన్స్ కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించారు. పోలీసులు, జిల్లా యంత్రాంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తన దరఖాస్తును తిరస్కరించేలా చేసిందని ఆరోపించారు.
ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు మహేంద్ర సింగ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుత్తం లక్నోలోని కింగ్‌జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు బాధితురాలి లేఖపై సుప్రీంకోర్టు స్పందించింది. కేసు విచారణను 45 రోజుల్లో పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. బాధితురాలికి రూ.25 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. (చదవండి: ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!)
Comments
Please login to add a commentAdd a comment