భారత్‌లో 'స్టెంట్లు' వేయడం ఓ పెద్ద మాయ
న్యూఢిల్లీ:
భారత దేశంలో జోరుగా సాగుతున్న ‘స్టెంట్ల’ వ్యాపారాన్ని తరచి చూస్తే ఆరోగ్యమైన గుండె కూడా ఆందోళనకు గురికావాల్సిందే. దేశంలో ఇప్పటి వరకు వేసిన ప్రతి మూడు స్టెంట్లలో కచ్చితంగా ఒక్క స్టంట్ అనవసరంగా వేసిందేనని ప్రముఖ కార్డియోలజిస్ట్‌లే అనుమానిస్తున్నారు. అసలు స్టెంట్ వేయడమే అవసరంలేని వారికి కూడా స్టెంట్ వేసి పంపుతున్నారు. ఏడాదికి ఏకంగా 25 వేల ఆంజియోప్లాస్టీలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు నేడు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ లెక్కన ఏడాదికి కోట్ల స్టెంట్లు అనవసరంగానే వేస్తున్నట్లు లెక్క.
వైద్య చికిత్సపై భారత్ కంటే ఎక్కువ పర్యవేక్షణ ఉండే అమెరికాలో 2007లో స్టెంట్ల చికిత్సపై ఆడిటింగ్ చేయగా సగానికి సగం స్టెంట్లు అనవసరంగా వేసినవేనని తేలింది. అప్పుడు అక్కడి ప్రభుత్వం వందలాది మంది డాక్టర్లను జైళ్లకు పంపడమే కాకుండా ఆస్పత్రులకు లక్షలాది డాలర్ల జరిమానాను విధించింది. వెంటనే స్టెంట్ల విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. మళ్లీ 2009లో స్టెంట్ల చికిత్సను ఆడిటింగ్ చేయగా అంతకుముందు అవసరం లేకున్నా స్టెంట్లు వేయడం 50 శాతం ఉండగా, అది 25 శాతానికి పడిపోయింది. అప్పుడు కూడా ఆస్పత్రులకు భారీ జరిమానాలు విధించడంతోపాటు అందుకు బాధ్యులైన వైద్యులను జైళ్లకు పంపించారు. ఫలితంగా అనవసరంగా స్టెంట్లు వేయడం 2014 నాటికి 13 శాతానికి పడిపోయింది. కేసుల పరంగా చూస్తే 21వేల నుంచి ఎనిమిది వేలకు పడిపోయింది.
భారత్ దేశంలో వైద్య చికిత్సలను ఆడిటింగ్ చేసే పద్ధతే కాదు, కనీసం ప్రైవేటు ఆస్పత్రులను క్రమబద్ధీకరించే వ్యవస్థ కూడా లేదు. భారత్‌లో కూడా స్టెంట్ల చికిత్సను ఆడిటింగ్ చేసే వ్యవస్థను తీసుకరావాలని, అంతకంటే ముందుగా ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలను తీసుకరావాలని ‘ఫార్టీస్ ఎస్కార్ట్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్’ కార్డియాలోజి విభాగం అధిపతి డాక్టర్ టీఎస్ క్లేర్ అభిప్రాయపడ్డారు. దీనికి మరో వ్యవస్థ ఏమీ అవసరం లేదని, భారత కార్డియాలోజి సొసైటీయే మార్గదర్శకాలను విడుదల చేసి, ఎప్పటికప్పుడు అదే ఆడిటింగ్ చేస్తే ఈ అనవసరంగా వేసే స్టెంట్లను అరికట్టవచ్చని ‘నారాయణ హెల్త్’ చైర్మన్ డాక్టర్ దేవి శెట్టి అభిప్రాయపడ్డారు.