టికెట్ కావాలా.. 25వేల లైకులు తెచ్చుకో!
సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ టికెట్ కావాలంటే పై స్థాయిలో ఉన్నవాళ్లను ప్రసన్నం చేసుకోవాలి. అందుకు తృణమో పణమో ఇచ్చుకోవడం మనం వింటూనే ఉన్నాం. పార్టీ టికెట్లు అమ్ముకున్నారంటూ భారీ ఎత్తున ఆరోపణలు కూడా వస్తుంటాయి. కానీ, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహపడుతున్న అభ్యర్థులకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఓ కొత్త షరతు పెట్టారు. దాన్ని చూసి అభ్యర్థులకు దిమ్మతిరిగింది. సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉంటున్న యూపీ బీజేపీ నేతలకు.. టికెట్ కావాలంటే కనీసం ఫేస్‌బుక్‌లో 25వేల లైకులు, ట్విట్టర్‌లో 25 వేల మంది ఫాలోవర్లు ఉండాలని అమిత్ షా అన్నారట. ఈ లెక్కన చూసుకుంటే అక్కడ ఎవరికీ అంత పరిస్థితి లేదు. సాక్షాత్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయికే ట్విట్టర్‌లో 10వేల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. షామ్లి ఎమ్మెల్యే, ముజఫర్‌నగర్ అల్లర్ల కేసు నిందితుడు సురేష్ రాణాకు 12,856 మంది ఫేస్‌బుక్‌లో ఫాలోవర్లున్నారు. మీరట్ ఎంపీ రాజేంద్రకుమార్ అగర్వాల్‌కు 13,957 లైకులు ఉండగా, బిజ్నోర్ ఎంపీ కువర్ భతేంద్ర సింగ్ ఫేస్‌బుక్ ఖాతాకు మాత్రం కేవలం 2,986 మంది స్నేహితులే ఉన్నారు.
కానీ, నాయకుల పాపులారిటీ చూడాలంటే జనంలో తెలుస్తుంది గానీ సోషల్ మీడియాను బట్టి లెక్కించడం ఏంటని కొంతమంది నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ లాంటి వాళ్లు మాత్రం కేవలం మూడు నెలల్లోనే అమిత్ షా ఇచ్చిన లక్ష్యాన్ని సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. యువతను ఆకట్టుకోడానికి ఇది మంచి మార్గమని, కొన్ని రోజుల క్రితం తనకు ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి అసెంబ్లీలో ఫలానా సమస్య మీద ప్రశ్నించాలంటూ మంచి సూచన కూడా పంపారని షామ్లి ఎమ్మెల్యే సురేష్ రాణా తెలిపారు. తనకు ఫ్యాన్ పేజీ లేదని, అది మొదలుపెడితే కనీసం లక్ష లైకులు వస్తాయని ధీమాగా చెప్పారు.