అమిత్ షాపై నిషేధం ఎత్తివేత
గురువారం అర్ధరాత్రి ఈసీ ప్రకటన ఎస్పీ, కాంగ్రెస్ అభ్యంతరం
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన ఆ పార్టీ నేత అమిత్ షాపై యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా విధించిన నిషేధాన్ని ఎన్నికల కమిషన్ గురువారం రాత్రి ఉపసంహరించింది. ఆయనపై విధించిన నిషేధాన్ని సడలిస్తున్నట్లు ప్రకటించింది. యూపీలో ఆయన ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని తెలిపింది.
రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించుకోవచ్చని...కానీ వాటిపై నిఘా కొనసాగిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. షా లిఖితపూర్వకంగా క్షమాపణ కోరడంతోపాటు ఇకపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించబోనని ప్రమా ణం చేస్తున్నట్లు పేర్కొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈసీపై సుప్రీంకోర్టుకెక్కుతా: అమిత్ షాపై నిషేధం ఎత్తేసిన ఈసీ...తనకు మాత్రం ఆ సడలింపు ఇవ్వకపోవడంపట్ల ఎస్పీ నేత, యూపీ మంత్రి ఆజం ఖాన్ మండిపడ్డారు. ఈసీ తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ఈసీకి క్షమాపణ చెప్పేంత తప్పు లేదా నేరం తానేమీ చేయలేదన్నారు.