ద్వేషపూరిత నేరాలకు ప్రత్యేక చట్టం
యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ
లక్నో: విద్వేషపూరిత నేరాల కట్టడికి నూతన చట్టం తీసుకొస్తామని బుధవారం విడుదల చేసిన యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే మహిళలు, ఓబీసీలు, మైనారిటీలపై కూడా వరాల జల్లు కురిపించింది. విభజన శక్తులను ఎదుర్కొనేందుకే కాంగ్రెస్–ఎస్పీ కూటమిగా ఏర్పడ్డాయని పేర్కొంది. ఎస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణించింది. బీజేపీ విద్వేష, విభజనపూరిత ఎజెండా ప్రతి ఎన్నికల్లోనూ స్పష్టమౌతోందని పేర్కొంది.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
కులం, మతం పేరుతో ఘర్షణలు రేపే వారికి కఠిన శిక్షలు విధించేలా ప్రత్యేక చట్టం. పోలీస్ అంబుడ్స్‌మన్ నియామకం. బాలికలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడంతో పాటు 18 ఏళ్లు వచ్చే నాటికి రూ.50 వేల– రూ.లక్ష అందించేలా ‘కన్య సశక్తికరణ్ యోజన’ అమలు. పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. రైతులకు, చేనేతలకు రుణాలు. 50 లక్షల మంది యువతకు ఉద్యోగాలు.