ఈ మెడికల్ కాలేజీ రూల్స్ సూపర్బ్
ఆగ్రా: సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లపై ఎలాంటి ర్యాగింగ్ చర్యలకు దిగకుండా ఉత్తరప్రదేశ్‌లోని సరోజిని నాయుడు మెడికల్ కాలేజీ ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఎలాంటి పనులు చేస్తే ర్యాగింగ్‌కింద భావించి పోలీసు చర్యలు మొదలవుతాయో స్పష్టంగా పేర్కొంటూ క్యాంపస్ ఏరియా మొత్తం కూడా నోటీసులు అంటించింది. ర్యాగింగ్ వ్యతిరేక చర్యలు తీసుకోవడం ఎప్పుడూ ముందుండే ఈ కాలేజీ ఈసారి కొన్ని అదనంగా కూడా చేర్చి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి భంగం కలగకుండా గట్టి చర్యలు ప్రారంభించింది.
ఎలాంటి సైగలతోనైనా, మాటలతోనైనా.. శారీరకంగాగానీ, మానసికంగాగానీ వేధింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆ కాలేజీ యాంటీ ర్యాగింగ్ సెల్ ప్రెసిడెంట్ ఎస్‌కే ఖతారియా మీడియాకు చెప్పారు. ఓ విద్యార్థి మరో విద్యార్థిని అతడు జూనియర్ అయిన, సీనియర్ అయినా రంగు, జాతి, మతం, కులం,లింగం, లైంగిక పరమైన, కనిపించేతీరుపైనా, ప్రాంతం, జాతీయత, భాష తదతర అంశాలను ఆధారంగా చేసుకొని ఎదుటివారిని వేధిస్తే మాత్రం ర్యాగింగ్ కిందకే వస్తుందని తెలిపారు.
ఎవరైనా వీటిని అతిక్రమిస్తే అతడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు హాస్టల్ నుంచి వెళ్లగొట్టి రూ.25వేలు ఫైన్ వేసి అతడి పరీక్ష ఫలితాలు కూడా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల దుస్తులు, జుట్టుపై కాలేజీకి ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రతి విద్యార్థి హుందాగా మాత్రం వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.