11 ఏళ్లుగా లేని కరెంటు.. యువతి లేఖతో వచ్చింది!
ఉత్తరప్రదేశ్‌లో ఓ గ్రామానికి గత 11 ఏళ్లుగా విద్యుత్ సరఫరా లేదు. ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇదంతా చూసిన ఓ మహిళ.. ఎన్నాళ్లు ఈ కష్టాలు భరించాలంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. అంతే, ఆ గ్రామానికి ఇప్పుడు విద్యుత్ వెలుగులు వచ్చేశాయి. ఇటా జిల్లాలోని బిదియా గ్రామ విజయగాధ ఇది. దీప్తి మిశ్రా (23) అనే యువతి ఆన్‌లైన్‌లో ప్రధానమంత్రి కార్యాలయానికి తమ ఊరి దుస్థితి గురించి ఫిర్యాదుచేసింది. ఆమె పుణ్యమాని ఇప్పుడు ఆ గ్రామం అంతా వెలుగులు విరజిమ్ముతున్నాయి. తామంతా 11 ఏళ్లుగా చేయలేని పని ఆ అమ్మాయి ఒక్క రోజులో చేసిందని, చదువుకునే రోజుల నుంచి కూడా ఆమె చాలా తెలివిగా ఉండేదని గ్రామపెద్ద రణవీర్ సింగ్ చౌదరి అన్నారు.
గ్రామానికి తొలిసారిగా 2005 జనవరిలో విద్యుత్ సదుపాయం వచ్చింది. కానీ అదే సంవత్సరం జూన్ నెలలో భారీ తుపాను రావడంతో విద్యుత్ లైన్లు పాడయ్యాయి. మొదట్లో బ్లాక్ స్థాయిలో గ్రామస్థులు ఫిర్యాదుచేశారు. కానీ పని జరగలేదు. కొన్నాళ్లు చూసి చూసి.. చివరకు అందరూ వదిలేశారు. అయితే దీప్తి మాత్రం అలా వదిలేయకుండా పీఎంఓకు ఫిర్యాదుచేయడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. తుపాను వల్ల పాడైన విద్యుత్ లైన్లను పునరుద్ధరించడంతో పాటు.. మూడు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేసినట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్‌కుమార్ తెలిపారు. అయితే గ్రామంలో ఒక్కరికి కూడా విద్యుత్ కనెక్షన్లు లేవని, ఎవరికి విద్యుత్ సరఫరా చేయాలని ఆయన అన్నారు.
కానీ గ్రామస్తుల వాదన మరోలా ఉంది. 11 ఏళ్లుగా కరెంటే లేనప్పుడు కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేస్తామని దీప్తి ప్రశ్నించింది. ఇప్పుడు సరఫరా వచ్చింది కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్క ఇంటివారూ కనెక్షన్లు తీసుకుంటారని ఆమె తెలిపింది. గ్రామంలోనే 12వ తరగతి వరకు చదివిన దీప్తి.. ఆ తర్వాత పై చదువుల కోసం నగరానికి వెళ్లిపోయింది. నోయిడాలో మాస్ కమ్యూనికేషన్స్ కోర్సు పూర్తిచేసింది.