letter to pmo
-
ఆ వ్యాపారవేత్తల పేర్లు వెల్లడించండి
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల సందర్భంగా ప్రధాని మోదీ వెంట ఉండే ప్రతినిధుల పేర్లను వెల్లడించాలని ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ) ఆర్.కె.మాధుర్ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)ను ఆదేశించారు. ‘జాతీయభద్రత’తో ముడిపడిన అంశమైనందున పేర్లను వెల్లడించలేమంటూ పీఎంవో అభ్యంతరం వ్యక్తం చేయటాన్ని తోసిపుచ్చారు. అయితే, ప్రధాని వెంట ఉండే భద్రతా సిబ్బంది, అధికారుల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. -
వరుణ్ గాంధీపై వగలాడి వల?
ఇందిరాగాంధీ మనవడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. వగలాడి వలలో (హనీ ట్రాప్) చిక్కుకుని దేశ రక్షణ రహస్యాలను లీక్ చేశారా? విదేశీ వ్యభిచారిణులతో ఉన్న ఫొటోల ఆధారంగా ఆయనను బ్లాక్మెయిల్ చేసి ఈ రహస్యాలను కొందరు సంపాదించారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి ఒక లేఖ వచ్చింది. అమెరికాకు చెందిన సి ఎడ్మండ్స్ ఎలెన్ అనే న్యాయవాది సెప్టెంబర్ 16న ఈ ఫిర్యాదు చేశారు. వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ ఈ వ్యవహారంలో ఉన్నాడని, అతడే వరుణ్ గాంధీని ఉపయోగించుకుని రక్షణ వివరాలను భారతదేశంతో కాంట్రాక్టులు కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఆయుధ తయారీదారులకు అందించాడని ఆ లేఖలో పేర్కొన్నారు. 2012 వరకు అభిషేక్ వర్మ, అలెన్ వ్యాపార భాగస్వాములు. పార్లమెంటరీ రక్షణ కమిటీ సభ్యుడిగా వరుణ్ గాంధీకి కొంత సమాచారం తెలుసని, అతడు జాతీయ భద్రతను పణంగా పెట్టి ఈ సమాచారం చేరవేశాడని ఎలెన్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను వరుణ్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇది ఏమాత్రం ఆధారాలు లేని నాన్సెన్స్ వ్యవహారమని ఆయన కొట్టిపారేశారు. ఈ ఆరోపణలకు ఏమైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. తాను గత 15 ఏళ్లలో ఎప్పుడూ అభిషేక్ వర్మను కలవలేదని చెప్పారు. అలాగే ఎలెన్ చెబుతున్న పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కాలేదన్నారు. తాను వగలాడి వలలో చిక్కుకున్నట్లుగా వాళ్లు చెబుతున్న ఫొటోలు ఏవీ నిజమైనవి కావని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తన పాత్రను తగ్గించాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మనీలాండరింగ్‌కు, మోసానికి పాల్పడుతున్నారంటూ ఎలెన్, వర్మ పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో అప్పటివరకు కొనసాగిన వాళ్ల భాగస్వామ్య వ్యాపారం 2012 జనవరిలో ముగిసిపోయింది. ఆ తర్వాతి నుంచి అభిషేక్ వర్మ మీద పలు ఆరోపణలు చేస్తూ ఎలెన్ తరచు భారతదేశానికి పలు పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. దాంతో పలు కేసుల్లో అభిషేక్ వర్మను అరెస్టుచేసి కొన్నాళ్లు జైల్లో కూడా పెట్టారు. తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. -
11 ఏళ్లుగా లేని కరెంటు.. యువతి లేఖతో వచ్చింది!
ఉత్తరప్రదేశ్‌లో ఓ గ్రామానికి గత 11 ఏళ్లుగా విద్యుత్ సరఫరా లేదు. ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇదంతా చూసిన ఓ మహిళ.. ఎన్నాళ్లు ఈ కష్టాలు భరించాలంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. అంతే, ఆ గ్రామానికి ఇప్పుడు విద్యుత్ వెలుగులు వచ్చేశాయి. ఇటా జిల్లాలోని బిదియా గ్రామ విజయగాధ ఇది. దీప్తి మిశ్రా (23) అనే యువతి ఆన్లైన్లో ప్రధానమంత్రి కార్యాలయానికి తమ ఊరి దుస్థితి గురించి ఫిర్యాదుచేసింది. ఆమె పుణ్యమాని ఇప్పుడు ఆ గ్రామం అంతా వెలుగులు విరజిమ్ముతున్నాయి. తామంతా 11 ఏళ్లుగా చేయలేని పని ఆ అమ్మాయి ఒక్క రోజులో చేసిందని, చదువుకునే రోజుల నుంచి కూడా ఆమె చాలా తెలివిగా ఉండేదని గ్రామపెద్ద రణవీర్ సింగ్ చౌదరి అన్నారు. గ్రామానికి తొలిసారిగా 2005 జనవరిలో విద్యుత్ సదుపాయం వచ్చింది. కానీ అదే సంవత్సరం జూన్ నెలలో భారీ తుపాను రావడంతో విద్యుత్ లైన్లు పాడయ్యాయి. మొదట్లో బ్లాక్ స్థాయిలో గ్రామస్థులు ఫిర్యాదుచేశారు. కానీ పని జరగలేదు. కొన్నాళ్లు చూసి చూసి.. చివరకు అందరూ వదిలేశారు. అయితే దీప్తి మాత్రం అలా వదిలేయకుండా పీఎంఓకు ఫిర్యాదుచేయడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. తుపాను వల్ల పాడైన విద్యుత్ లైన్లను పునరుద్ధరించడంతో పాటు.. మూడు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటుచేసినట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్‌కుమార్ తెలిపారు. అయితే గ్రామంలో ఒక్కరికి కూడా విద్యుత్ కనెక్షన్లు లేవని, ఎవరికి విద్యుత్ సరఫరా చేయాలని ఆయన అన్నారు. కానీ గ్రామస్తుల వాదన మరోలా ఉంది. 11 ఏళ్లుగా కరెంటే లేనప్పుడు కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేస్తామని దీప్తి ప్రశ్నించింది. ఇప్పుడు సరఫరా వచ్చింది కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్క ఇంటివారూ కనెక్షన్లు తీసుకుంటారని ఆమె తెలిపింది. గ్రామంలోనే 12వ తరగతి వరకు చదివిన దీప్తి.. ఆ తర్వాత పై చదువుల కోసం నగరానికి వెళ్లిపోయింది. నోయిడాలో మాస్ కమ్యూనికేషన్స్ కోర్సు పూర్తిచేసింది.