వరుణ్ గాంధీపై వగలాడి వల?
ఇందిరాగాంధీ మనవడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. వగలాడి వలలో (హనీ ట్రాప్) చిక్కుకుని దేశ రక్షణ రహస్యాలను లీక్ చేశారా? విదేశీ వ్యభిచారిణులతో ఉన్న ఫొటోల ఆధారంగా ఆయనను బ్లాక్‌మెయిల్ చేసి ఈ రహస్యాలను కొందరు సంపాదించారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి ఒక లేఖ వచ్చింది. అమెరికాకు చెందిన సి ఎడ్మండ్స్ ఎలెన్ అనే న్యాయవాది సెప్టెంబర్ 16న ఈ ఫిర్యాదు చేశారు. వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ ఈ వ్యవహారంలో ఉన్నాడని, అతడే వరుణ్ గాంధీని ఉపయోగించుకుని రక్షణ వివరాలను భారతదేశంతో కాంట్రాక్టులు కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఆయుధ తయారీదారులకు అందించాడని ఆ లేఖలో పేర్కొన్నారు. 2012 వరకు అభిషేక్ వర్మ, అలెన్ వ్యాపార భాగస్వాములు. పార్లమెంటరీ రక్షణ కమిటీ సభ్యుడిగా వరుణ్ గాంధీకి కొంత సమాచారం తెలుసని, అతడు జాతీయ భద్రతను పణంగా పెట్టి ఈ సమాచారం చేరవేశాడని ఎలెన్ ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను వరుణ్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇది ఏమాత్రం ఆధారాలు లేని నాన్సెన్స్ వ్యవహారమని ఆయన కొట్టిపారేశారు. ఈ ఆరోపణలకు ఏమైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. తాను గత 15 ఏళ్లలో ఎప్పుడూ అభిషేక్ వర్మను కలవలేదని చెప్పారు. అలాగే ఎలెన్ చెబుతున్న పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కాలేదన్నారు. తాను వగలాడి వలలో చిక్కుకున్నట్లుగా వాళ్లు చెబుతున్న ఫొటోలు ఏవీ నిజమైనవి కావని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తన పాత్రను తగ్గించాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
మనీలాండరింగ్‌కు, మోసానికి పాల్పడుతున్నారంటూ ఎలెన్, వర్మ పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో అప్పటివరకు కొనసాగిన వాళ్ల భాగస్వామ్య వ్యాపారం 2012 జనవరిలో ముగిసిపోయింది. ఆ తర్వాతి నుంచి అభిషేక్ వర్మ మీద పలు ఆరోపణలు చేస్తూ ఎలెన్ తరచు భారతదేశానికి పలు పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. దాంతో పలు కేసుల్లో అభిషేక్ వర్మను అరెస్టుచేసి కొన్నాళ్లు జైల్లో కూడా పెట్టారు. తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది.