
ఎక్కడో పొరపాటు జరిగింది: రక్షణ మంత్రి
న్యూఢిల్లీ: ఉడీ తరహా దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. మాటలు చెప్పడానికి కంటే చేతల్లో చేసి చూపించడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. ఏదో పొరపాటు కారణంగానే ఉడీ దాడికి అవకాశం ఏర్పడివుంటున్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పొరపాటును సరిదిద్దుకుంటామని, భవిష్యత్ లో ఇలాంటి దాడులు జరగకుండా చూసుకుంటామన్నారు.
‘మొత్తానికి ఎక్కడో పొరపాటు జరిగింది. నేను వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదు. ఇది చాలా సున్నిత విషయం. జరిగిన పొరపాటును సరిదిద్దుకుని పునరావృతం కాకుండా చూసుకుంటాం. ఎక్కడ పొరపాటు జరిగిందనేది కచ్చితంగా కనుక్కుంటాం. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామ’ని పరీకర్ అన్నారు.
తప్పులు చేయకుండా ఉండడం, వందశాతం కచ్చితత్వంతో పనిచేయడం తన జీవన విధానమని చెప్పారు. ఉడీ తరహా దాడులు మళ్లీమళ్లీ జరగబోవని దేశ ప్రజలకు హామీయిచ్చారు. జమ్మూకశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఆదివారం విదేశీ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది సైనికులు వీర మరణం పొందగా, 20 మంది వరకు గాయపడ్డారు.