పఠాన్కోట్ దాడి కేసులో పాక్కు షాక్
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడికి తమకు సంబంధం లేదని బీరాలు పోయిన పాకిస్థాన్ మరోసారి ఇరుకున పడింది. ఈ కేసును ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తుండగా ఆ విచారణకు అమెరికా మరింత బలాన్ని చేకూర్చింది. పఠాన్ కోట్ దాడి పాకిస్థాన్ నుంచే జరిగిందని నిరూపించేలా ఉన్న ఆధారాలను అమెరికా అధికారులు ఎన్ఐఏకు అప్పగించారు. దాడికి పాల్పడిన వారు ఉపయోగించిన ఫేస్ బుక్ ఖాతాల ఐపీ అడ్రస్లు పాకిస్థాన్లోనే ఉన్నట్లు గుర్తించి వాటి ఆధారాలను ఎన్ఐకు ఇచ్చారు.
అంతేకాదు.. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న అల్ రహ్మత్ ట్రస్ట్ ఐపీ అడ్రస్ కూడా పాక్ లోనే ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రకారం దాడి జరిగే సమయంలో అల్ రహ్మత్ వెబ్ పేజీ ని రంగనూర్ డాట్ కామ్ అనే సైట్ లో, అల్కాలంఆన్ లైన్ డాట్ కామ్ అనే మరో సైట్‌లో అప్ లోడ్ చేశారు. ఈ రెండింటికి కూడా తారిక్ సిద్దిఖీ ఒకే ఈమెయిల్ ఉపయోగించారని, మొత్తానికి దాడి సమయంలో ఉపయోగించిన ఈ ఐపీ అడ్రెస్ లు పాకిస్థాన్లో ఉన్నట్లు తాము గుర్తించామని పేర్కొంటూ అమెరికా భారత ఎన్ఐఏ అధికారులకు అధారాలు సమర్పించారు.