విదేశీ యువతిని వేధించిన క్యాబ్ డ్రైవర్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో క్యాబ్ డ్రైవర్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. విదేశాలనుంచి వచ్చిన టూరిస్ట్ మహిళలు, యువతులను కూడా వదలకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా అమెరికా నుంచి వచ్చిన 20 ఏళ్ల యువతిని ఢిల్లీకి చెందిన క్యాబ్ కంపెనీ డ్రైవర్ లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 24 న ఈ ఘటన జరిగితే, నాలుగు రోజులు మానసిక వేదన తర్వాత ఫిర్యాదు చేయడానికి బాధితురాలు ముందుకొచ్చింది. జూలై 28 తన స్నేహితుల సహాయంతో అహ్మద్ నగర్లో ఫిర్యాదు చేసింది.
అహ్మద్ నగర్లోని ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించేందుకు ఆ యువతి అమెరికా నుంచి వచ్చింది. ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ ప్రాంతంలోని ఓ హోటల్ లో జూలై 24న దిగి సమీప ప్రాంతాలను సందర్శించేందుకు ట్యాక్సీ అద్దెకు తీసుకుంది. మార్గ మధ్యంలో డ్రైవర్ ...ఆమెను బలాత్కరించడానికి ప్రయత్నించాడు. భయంతో ఆమె ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోయింది.
అనంతరం తన పర్యటనలో భాగంగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ వెళ్ళిపోయింది. అక్కడికి చేరిన తరువాత జరిగిన సంఘటనను స్నేహితులతో పంచుకుంది. దీంతో వారు అహ్మద్ నగర్ ఎస్పీని కలిసి విషయాన్ని వివరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు, వేధింపుల ఘటన ఢిల్లీలో చోటు చేసుకోవడంతో కేసును ఢిల్లీకి బదిలీ చేశారు.
అహ్మద్ నగర్ పోలీసుల వివరాలను స్వీకరించి దర్యాప్తు చేపట్టామని ఢిల్లీ డీసీపీ సింగ్ రాంన్ధ్వా వెల్లడించారు. వేధింపులకు పాల్పడిన డ్రైవరును గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. డ్రైవర్ దేవరాజ్ చౌహాన్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలో క్యాబ్ ఆఫీసులపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిఘా పెట్టామని వెల్లడించారు.