
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది..
జైపూర్: దాహం తీర్చుకునేందుకు వచ్చిన ఓ చిరుతపులి తల ఓ బిందెలో ఇరుక్కుపోయింది. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయి సుమారు రెండు గంటల పాటు నానా తిప్పలు పడ్డ చిరుత ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు, పోలీసుల చొరవతో బయటపడింది. రాజస్థాన్ లోని రాజ్సమండ్ లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత ఘటనపై సమాచారమందుకున్న అధికారులు... వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని ఆపరేషన్ టైగర్‌ను మొదలుపెట్టారు.
చిరుతకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. జాగ్రత్తగా బంధించారు. ఆ తర్వాత నిదానంగా బిందెలో చిక్కుకున్న పులి తలను బయటకు తీశారు. అయితే బిందె తీసేందుకు ముందు.. చిరుత చేసిన హల్‌చల్ అంతా ఇంతా కాదు. ముఖానికి బిందెతో చిక్కకుండా... అధికారులందర్నీ పరుగులు పెట్టించింది. చివరకు మత్తు ఇంజెక్షన్ ప్రభావంతో చిరుత స్పృహ కోల్పోయిన తర్వాత అధికారులు తమ పని కానిచ్చారు. అనంతరం చిరుతను అధికారులు అక్కడ నుంచి తరలించారు.