లక్నో : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఫలితంగా యూపీలోని 6 జిల్లాలో ఇప్పటికే 84 మంది మరణించారు. దాంతో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా బరేలి జిల్లాలో అత్యధికంగా 24 మంది మృతి చెందగా, సమీప బుదౌన్ జిల్లాలో 23 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధిలో ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ లక్షణాలు కలగలసి కనిపిస్తున్నాయి. అందువల్ల పూర్తి స్థాయిలో వ్యాధి నివారణ జరగకపోవడంతో ఇప్పటికే 84 మంది మరణించారు.
ఈ విషయం గురించి యూపీ వైద్య శాఖ మంత్రి సిద్ధార్ధ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలయడం లేదు. వ్యాధి బారిన పడిన వారిలో మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫివర్ లక్షణాలు కలగలసి కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వ్యాధి నివారణ కోసం తగు చర్యలు తీసుకుంటుంది. ఈ వ్యాధి ముఖ్యంగా రాజధాని చుట్టుపక్కల జిల్లాలైన బరేలీ, బుదౌన్, హరోయి, సీతాపూర్, బహ్రైచ్, షాజహాన్‌పూర్ జిల్లాలో వ్యాపించింది. ఇది ఇలా కొనసాగితే రాజధానిలో కూడా పాకే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యాధి నివారణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడమే కాక అవసరమైన మందులు సరఫరా చేస్తున్నాం. దోమల నివారణ కోసం ఫాగింగ్ కూడా జరుపుతున్నాం’ అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సమయంలో ప్రజలను కోరేది ఒక్కటే.. మీ కుటుంబ సభ్యుల్లో కానీ, బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా జబ్బు పడితే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లండి. మీడియా వారు కూడా సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. అనవసరమైన పుకార్లను, వదంతులను ప్రచారం చేయవద్దని అభ్యర్ధిస్తున్నాను. త్వరలోనే వ్యాధి తీవ్రత తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాన’ని తెలిపారు. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment