సీఎం బస్సు.. ఎంత హైటెక్కో! | uttar pradesh CM akhilesh yadav Purchases Luxury Bus for campaigning in assembly polls | Sakshi
Sakshi News home page

సీఎం బస్సు.. ఎంత హైటెక్కో!

Published Thu, Oct 27 2016 10:21 AM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

సీఎం బస్సు.. ఎంత హైటెక్కో! - Sakshi

సీఎం బస్సు.. ఎంత హైటెక్కో!

లక్నో : అభివృద్ధి నుంచి విజయం దిశగా..' ఇదీ యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నవంబర్ మూడో తేదీ నుంచి మొదలుపెట్టబోతున్న రథయాత్ర పేరు. ఇందుకోసం ఆయన అత్యాధునిక బస్సు ఒకదాన్ని సిద్ధం చేయించుకున్నారు. దాంట్లో ఉన్న సదుపాయాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే. వచ్చే సంవత్సరం జరగబోతున్న ఎన్నికల కోసం ఈ బస్సును అఖిలేశ్ ఎప్పుడో రెడీ చేయించారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దగ్గరున్న వ్యానిటీ వ్యాన్ కంటే కూడా ఇది చాలా పెద్దది.

వాస్తవానికి ఈ వ్యాన్‌లో అఖిలేశ్ ఈ నెల 3 నుంచే ప్రచారం ప్రారంభించాలనుకున్నారు గానీ.. యాదవ్ కుటుంబంలో చెలరేగిన చిచ్చు కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక పార్టీలోను, కుటుంబంలోను ఉన్న అంతర్గత తగాదాలను కాసేపు పక్కన పెట్టి.. ప్రచారం సంగతి చూసుకుందామని సిద్ధమవుతున్నారు. వచ్చే నెల మూడో తేదీన లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఎదురుగా ఉన్న లా మార్టినెర్ స్కూలు గ్రౌండ్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. తొలి రెండు రోజులు యాత్ర పూర్తయ్యాక వెంటనే మళ్లీ లక్నో వచ్చి.. పార్టీ రజతోత్సవాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

ఇంతకు ముందున్న నాలుగు చక్రాల బస్సులు, ట్రక్కులలా కాకుండా సీఎం విజయరథాన్ని అత్యాధునికంగా రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి, తమకు కావల్సిన సదుపాయాలన్నింటినీ అందులో కల్పించుకున్నారు. మామూలుగా అయితే రూ. 50 లక్షల వరకు ఖర్చయ్యే ఈ బస్సుకు.. మేకోవర్ తర్వాత దాదాపు కోటి రూపాయల వరకు అయినట్లు సమాచారం. ప్రచారం కోసం అఖిలేశ్ యాదవ్ హైటెక్ బస్సులు వాడటం ఇది మొదటిసారేమీ కాదు.. ఇంతకుముందు 2012 ఎన్నికల సమయంలో కూడా ఆయన 'క్రాంతి రథం' ఉపయోగించారు. అయితే అప్పట్లో దాన్ని తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి తీసుకున్నారు. అప్పట్లో కూడా ఆయన రాష్ట్రం మొత్తం ఒక్కరే తిరిగారు. పార్టీలో మిగిలిన సీనియర్లంతా వేదికల మీద నుంచి ప్రసంగిస్తే.. అఖిలేశ్ మాత్రం ఆ ర్యాలీలు వేటిలోనూ పాల్గొనకుండా నేరుగా బస్సులోంచే తన యువదళం మద్దతుతో ప్రచారం చేశారు.

తాజాగా అఖిలశ్ యాదవ్ చేపట్టే యాత్ర మార్గం ఇంకా నిర్ణయించాల్సి ఉంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ పని పూర్తవుతుందని అఖిలేశ్ మంత్రివర్గ సహచరుడు రాజేంద్ర చౌదరి తెలిపారు. ఐదో తేదీన రాజధాని లక్నోలో జరిగే పార్టీ రజతోత్సవాలలో పాల్గొని, మళ్లీ తన యాత్రను సీఎం పునరుద్ధరిస్తారన్నారు. కాగా గతంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ఎన్నికల ప్రచారం కోసం అన్ని హంగులతో కూడిన లగ్జరీ బస్సులను ప్రత్యేకంగా చేయించుకున్న విషయం తెలిసిందే

బస్సులో ఉన్న సౌకర్యాలు ఇవీ...

  • ఇది పది చక్రాల మెర్సిడెస్ బస్సు
  • బస్సు మొత్తం పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్
  • ప్రజలనుద్దేశించి అఖిలేష్ మాట్లాడేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్టు
  • హై ఫిడెలిటీ సౌండ్ సిస్టమ్
  • వీడియోలు చూపించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు
  • వెనక్కి సులభంగా వాలే మెకనైజ్డ్, హైడ్రాలిక్ కుర్చీలు
  • బస్సులోనే రెస్ట్ రూం, వంటగది, ప్లష్ వాష్‌రూం
  • వై-ఫై సదుపాయం, వై-ఫై అనుసంధానం ఉన్న టీవీ
  • అత్యాధునిక ఏసీ సిస్టమ్, గాలిశుద్ధి పరికరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement