ప్రతీకాత్మక చిత్రం
లక్నో : వరుడి మితిమీరిన ప్రవర్తనతో ఓ పెళ్లి పీటలమీద ఆగిపోయింది. ఆచారం కాస్తా వివాదానికి దారి తీయడంతో చివరకు పెళ్లి రద్దయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. వివేక్ కుమార్ (22) వివాహం పట్టణానికి చెందిన ఓ యువతితో శనివారం జరగాల్సి ఉంది. అయితే, వరుడిని పెళ్లి మండపంలోకి తోడ్కొని వెళ్లే క్రమంలో వివాదం చోటుచేసుకుంది. ‘జూతా చురాయి’ అనే ఆచారం ప్రకారం వరుడికి మరదలు వరసయ్యే యువతి వివేక్ చెప్పులు దాచిపెట్టింది. డబ్బులు ఇస్తేనే వాటిని తిరిగి ఇస్తానని అతన్ని ఆటపట్టించింది. అయితే, ఆగ్రహంతో ఊగిపోయిన వివేక్ ఆమెను బండ బూతులు తిట్టాడు. సర్ది చెప్పుదామని చూసిన వ్యక్తిపై చేయి కూడా చేసుకున్నాడు.
ఈ వివాదం పెళ్లి కూతురికి తెలియడంతో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ తేల్చిచెప్పింది. వధువు తల్లిదండ్రులు కూడా వివేక్ వ్యవహారం నచ్చకపోవడంతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. పెళ్లి కొడుకును, అతని తండ్రి, మరో ఇద్దరు బంధువులను నిర్భంధించారు. వరకట్నం కింద తీసుకున్న రూ.10 లక్షలు తిరిగి చెల్లించేందుకు పెళ్లి కొడుకు తరపువారు అంగీకరించడంతో వారిని విడిచి పెట్టారు. ఈ ఘటనపై మజఫర్‌నగర్ స్టేషన్ ఆఫీసర్ వీరేంద్ర కసానా మాట్లాడుతూ.. పెద్ద మనుషుల సమక్షంలో ఇరు కుటుంబాలు సమస్య పరిష్కరించుకున్నాయని తెలిపారు. ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment