10న ఉత్తరాఖండ్‌లో బలపరీక్ష
సుప్రీంకోర్టు ఆదేశం
♦ సింగిల్ ఎజెండాతో అసెంబ్లీని సమావేశపరచాలి
♦ ఓటింగ్ సమయంలో రాష్ట్రపతి పాలన రద్దు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఈనెల 10న బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పదవీచ్యుత సీఎం హరీశ్ రావత్ (కాంగ్రెస్)కు విశ్వాస పరీక్ష ఉంటుందని స్పష్టంచేసింది. సస్పెన్షన్ వేటు పడిన 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత.. సభలో ఓటింగ్ జరిగే వరకు కొనసాగితే వారు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్దేశించింది. మంగళవారం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు ఈ ఒక్క ఎజెండాతోనే శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి బలపరీక్ష నిర్వహించాలని పేర్కొంది. ఆ రెండున్నర గంటలపాటు రాష్ట్రపతి పాలనను తాత్కాలికంగా నిలిపిఉంచాలని, ఆ సమయంలో రాష్ట్ర ఇన్‌చార్జిగా గవర్నర్ సాగాలని చెప్పింది.
ఈమేరకు జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేల కేసు ఉత్తరాఖండ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో సుప్రీంకోర్టు వారిని ఓటింగ్‌కు దూరంగా ఉంచింది. అయితే హైకోర్టులో వారికి సానుకూలంగా వస్తే వారు ఓటింగ్‌కు హాజరవచ్చు. దీనిపై హైకోర్టులో శనివారం వాదనలు జరగనున్నాయి. మార్చి 18న ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం విషయంలో వివాదంతో రాష్ట్రంలో సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. బలపరీక్ష నిర్వహణకు కేంద్రానికి అభ్యంతరం లేదంటూ అడ్వొకేట్ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు చెప్పారు.
బలపరీక్ష కోసం సుప్రీం మార్గదర్శకాలను నిర్దేశించింది. అసెంబ్లీ ముఖ్యకార్యదర్శి పర్యవేక్షణలో విశ్వాసపరీక్ష నిర్వహించాలని, ఈ తంతు మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని పేర్కొంది. ఓటింగ్ ఫలితాన్ని, వీడియో సీడీని ఈనెల 11న 10.30 గంటలకు తమకు సీల్డ్‌కవర్‌లో అందజేయాలని శాసనసభ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. అర్హులు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనేలా, ఈ వ్యవహారం ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను నిర్దేశించింది. విశ్వాస పరీక్ష మినహా సభలో ఎలాంటి అంశాన్నీ చర్చించడానికి వీల్లేదంది. సభలో తీర్మానానికి మద్దతిచ్చే వారు ఒకవైపు, వ్యతిరేకంగా ఉన్న వారు మరోవైపు కూర్చోవాలని చెప్పింది. మధ్యాహ్నం ఒంటిగంటకు కార్యక్రమం పూర్తయిన తర్వాత రాష్ట్రపతి పాలనను పునరుద్ధరించాలంటూ ఏప్రిల్ 22న సుప్రీం జారీచేసిన ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ధర్మాసనం స్పష్టంచేసింది.
అసెంబ్లీలో బలాబలాలు
మొత్తం సభ్యులు: 70 బీజేపీ: 28 కాంగ్రెస్: 27 బీఎస్పీ: 2 స్వతంత్రులు: 3 ఠ యూకేడీపీ: 1 సస్పెన్షన్ వేటుపడినవారు: 9 (కాంగ్రెస్ రెబల్స్)
(బీజేపీ ఎమ్మెల్యే బీఎల్ ఆర్య మార్చి 18న ద్రవ్యవినిమయ బిల్లు సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు)