అంట్లుతోమే పని నుంచి అంతర్జాతీయ అథ్లెట్‌ స్థాయికి!  | Vasanthi to the World Masters Athletic Championship | Sakshi
Sakshi News home page

అంట్లుతోమే పని నుంచి అంతర్జాతీయ అథ్లెట్‌ స్థాయికి! 

Published Sun, Jul 1 2018 2:33 AM | Last Updated on Sun, Jul 1 2018 2:33 AM

Vasanthi to the World Masters Athletic Championship - Sakshi

తమిళనాడుకు చెందిన వాసంతీ ఆనందన్‌ జీవితం ఎందరో అథ్లెట్లకు స్ఫూర్తినిస్తోంది. ఎందుకంటే అంట్లు తోముకునే ఆమె మరో 2 నెలల్లో స్పెయిన్‌లోని మలాగాలో జరగబోయే వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో 5000 మీటర్ల రన్నింగ్, హాఫ్‌ మారథాన్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. తమిళనాడులోని తిరుచినాపల్లి జిల్లాలోని తిరువాయూర్‌ వాసంతి సొంత వూరు. పదేళ్ల క్రితం భర్త ఆనందన్‌తో పాటు తన ఇద్దరు పిల్లలు  మణికందన్, కిరుతిక లను వెంటబెట్టుకొని కోయంబత్తూరుకి చేరుకుంది వాసంతి కుటుంబం. 36 ఏళ్ల వాసంతి భర్త ప్రైవేటు బస్‌ డైవర్‌. ఇద్దరు పిల్లల పోషణాభారం పంచుకునేందుకు వాసంతి నాలుగిళ్లల్లో గిన్నె లు కడిగే పనికి కుదిరారు. వాసంతి భర్త ఆనంద్‌కూడా రన్నర్‌ కావడంతో వారి ఇద్దరు పిల్లలకూ రన్నింగ్‌లో శిక్షణనిప్పిస్తున్నారు.

రన్నింగ్‌ శిక్షణ కోసం పిల్లల్ని  ప్రతిరోజూ గ్రౌండ్‌కి తీసుకెళ్లి దింపే బాధ్యత వాసంతిది. కోచ్‌ వైరవనాథన్‌ వాసంతిని చూడటం తో ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. అదే దేశానికి మంచి అథ్లెట్‌ను పరిచయం చేసింది. కోయంబత్తూరులోని నెహ్రూ స్టేడియంలో ప్రతిరోజూ తన పిల్లలను దింపేవారు వాసంతి. సన్నగా ఉన్నా అథ్లెట్‌కి ఉండాల్సిన శరీరాకృతినీ, చురుకుదనాన్నీ వాసంతి లో చూశారు కోచ్‌ వైరవనాథన్‌. ఆమె లాంగ్‌ డిస్టెన్స్‌ లో బాగా పరిగెత్తగలదని కూడా ఆయన గుర్తించారు. మొదట అదే విషయం   ప్రస్తావిం చినప్పుడు వాసంతి ఒప్పుకోలేదు. ఆ తర్వాత గత ఏడాది సమ్మర్‌ క్యాంప్‌ సందర్భంగా వంటావార్పూలో వాసంతి సహాయాన్ని కోరడంతో ఆమె క్యాంప్‌కి రావడం మొదలెట్టారు. ఖాళీ సమయంలో వాసంతిని రన్నింగ్‌వైపు ప్రోత్సహించారు కోచ్‌ వైరవనాథ్‌. అంతే ఆమె ఇక వెనుదిరిగి చూడలేదు. అనతి కాలంలోనే అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగారు. భారతీ యార్‌ వర్సిటీలో మొదట జిల్లా స్థాయి చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొన్నారు.

ఆ తర్వాత తమిళనాడు మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన పోటీ ల్లో పాల్గొన్నారు. జాతీయస్థాయిలో మాస్టర్స్‌ అథ్లె టిక్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పోటీల్లో వరుసగా 5000 మీటర్ల రన్నింగ్‌లో రజత, హాఫ్‌ మారథాన్‌లో స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్‌లో స్పెయిన్‌లో జరగబోయే వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు తీవ్రంగా కృషి చేస్తున్నారు వాసంతి. అయితే ఆర్థిక ప్రోత్సాహం లేకపోతే ఒక అథ్లెట్‌ తీసుకోవాల్సిన ఖరీదైన ఆహారం, మంచి స్పోర్ట్స్‌ వేర్‌ ఉండవంటున్నారు. రోజూ 4 గంటలపాటు కోచింగ్‌ కోసం వెచ్చించాల్సి రావడంతో ప్రస్తుతానికి ఇళ్లల్లో పనిచేయడం మానేసినట్టు వాసంతి మీడియాకి వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement