
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. బుధవారం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘విభిన్న రంగాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. కక్షిదారుల వ్యయప్రయాసలను తగ్గించేందుకు, సత్వర న్యాయం అందే దిశగా, దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో సుప్రీం కోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలి. రాజకీయ నేతలపై క్రిమినల్ కేసుల విషయంలో వేగం అవసరం. ఫిరాయింపులకు పాల్పడినవారిపై పరిమిత కాలంలో నిర్ణయం తీసుకోవాలి. రాజ్యసభలో సభ సజావుగా జరగని సందర్భాల కంటే నిర్మాణాత్మక చర్చలను మీడియా చూపించాలి’ అని పేర్కొన్నారు.