సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతిపాదించిన పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి తన నివాసంలో కేంద్ర మంత్రి, ఆయా శాఖల కార్యదర్శులతో సమావేశమై తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపాదిత ప్రాజెక్టుల పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం–చిత్తూరు మధ్య పారిశ్రామిక కారిడార్ పనుల గురించి, కాకినాడలో ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)పైనా సమావేశంలో చర్చించారు.
గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకుని గుంటూరు జిల్లాలో స్పైసెస్ పార్క్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌లపైనా చర్చ జరిగింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ప్రతిపాదించిన ఫార్మా సిటీ అంశంపైనా వెంకయ్య నాయుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులను.. వాటికి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ప్రాజెక్టుల వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రికి సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో పనులను వేగవంతం చేయండి
Published Sat, Feb 15 2020 4:11 AM | Last Updated on Sat, Feb 15 2020 4:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment