
కోల్‌కతా : జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని, భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కశ్మీర్ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి ప్రతీ ఒక్కరు జాతీయ భద్రత గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం భారత దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రథమ వర్ధంతి సందర్భంగా కోల్‌కతాలోని ఐసీసీఆర్ వద్ద ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...‘72 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రోజురోజుకీ మన జనాభా పెరగిపోతోంది. కానీ మనకు సరిపడా భూములు లేవు. భారత్ వంటి దేశాలు ఆహార ఉత్పత్తుల దిగుమతిపై ఆధారపడకూడదు. సొంతంగా పంటలు పండించుకోవాలి. అందుకే జనాభాను నియంత్రించగలగాలి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ఉటంకించారు.
ప్రపంచం భారత్‌ను గౌరవించింది అపుడే..
అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించిన అనంతరం వెంకయ్యనాయుడు ఆయన సేవలను ప్రస్తుతించారు. ‘ అటల్‌జీ పాలనలోనే అసలైన సంస్కరణలు మొదలయ్యాయి. ‘సాంకేతికత, నూతన ఆవిష్కరణలతో పాటు సామాన్యుల జీవితాలను మార్చే విధంగా క్రమపద్ధతిలో ఆయన పాలన సాగింది. సుస్థిరాభివృద్ధికి అటల్‌జీ హయాంలోనే బీజం పడింది. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలించారు. సుపరిపాలన అందించారు. అప్పుడే ప్రపంచం భారత్‌ను గౌరవించడం మొదలుపెట్టింది’ అని వెంకయ్యనాయుడు వాజ్‌పేయి పాలనను కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment