
'పార్లమెంటు సమావేశాలపై దేశమంతటికీ అసంతృప్తి'
న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని, ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగిన తీరుపై యావత్ భారతదేశం అసంతృప్తిగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత నవంబర్ 26న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభకు 112 గంటలు కేటాయించగా కేవలం సగం సేపు మాత్రమే సభ జరిగిందని, అందువల్ల దాదాపు రూ.10 కోట్ల ప్రజాధనం వృథా అయిందని వెంకయ్య వివరించారు. రాజ్యసభలో కేవలం 9 బిల్లులే ఆమోదం పొందాయని, తాము అనుకున్న దాంట్లో 46 శాతం మాత్రం చేయగలగడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. లోక్సభకు 114 గంటలు కేటాయించగా, 115 గంటల సమయం సభ కొనసాగిందని చెప్పారు.
ఎన్డీయే ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీని చూసి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎలాంటి తప్పులు జరగలేదన్నారు. పార్లమెంట్ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు. ఈ శీతాకాల సమావేశాలలో లోక్సభలో 14 బిల్లులు ఆమోదం పొందాయని చెబుతూ.. దీనిపై హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభను ఎందుకు సజావుగా సాగనివ్వలేదన్న దానిపై దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సిందే అన్నారు. ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించారని చెప్పారు.