న్యూఢిల్లీ: ‘మన గ్రామాలు ఇప్పటికీ కులతత్వ విషంతో నిండిపోయాయి. కులతత్వ విషం గ్రామాలను నాశనం చేస్తోంది. గ్రామాల స్వప్నాలను ధ్వంసం చేస్తోంది. కులతత్వాన్ని వీడేలా మనం చర్యలు తీసుకోవాలి. అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి’అని ప్రధాని మోదీ అన్నారు. గ్రామీణ భారతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఫలవంతమైన అభివృద్ధి పథకాలను రూపొం దించాలన్నారు. ఢిల్లీలో లోక్‌నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ జయంతి, సంస్కరణవాది నానాజీ దేశ్‌ముఖ్ శత జయంతి వేడుకల్లో మోదీ పాల్గొన్నారు.
సహజవనరులకు కొరత లేదు..
దేశంలో సహజ వనరులకు కొరత లేదని, చివరి వ్యక్తి వరకూ అందజేసేందుకు వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సరైన ఫలితాలు రావాలంటే అందుకు తగ్గ మెరుగైన పాలనా యంత్రాంగం అవసరమన్నారు. మెరుగైన పాలనా యంత్రాంగం ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చని, అలాగే ఎక్కువ ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని చెప్పారు. గ్రామీణ భారతం సర్వతోముఖాభివృద్ధికి.. ప్రజల అవసరాలను గుర్తించి పథకాలకు రూపకల్పన చేయాలని, వీటి కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు.
గ్రామీణాభివృద్ధి స్ఫూర్తి దెబ్బ తినకూడదు
గ్రామీణాభివృద్ధి స్ఫూర్తి దెబ్బ తినకుండా.. మెరుగైన ఫలితాలే లక్ష్యంగా కొత్త పథకాల రూపకల్పన ఉండాలని మోదీ చెప్పారు. గ్రామాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా, ఆప్టికల్ పైబర్ కేబుల్‌తో ఇంటర్నెట్ మొదలైన అవకాశాలు కల్పిస్తే ఉపాధ్యాయులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులకు అక్కడ జీవించడానికి ఎటువంటి సంకోచం ఉండబోదని చెప్పారు. వారు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించడం ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. జయప్రకాశ్ నారాయణ్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడారని, అప్పట్లో అధికారంలో ఉన్న వారిని ఆయన నాయకత్వం వణికించిందన్నారు. దేశ్‌ముఖ్ మంత్రి పదవిని తిరస్కరించి, గ్రామీణాభివృద్ధి కోసం జేపీతో కలసి నడిచారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment