హిందూ ఉద్యమ నేత అశోక్ సింఘాల్ | Veteran VHP leader Ashok Singhal dies at Gurgaon hospital | Sakshi
Sakshi News home page

హిందూ ఉద్యమ నేత అశోక్ సింఘాల్

Published Tue, Nov 17 2015 5:21 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

హిందూ ఉద్యమ నేత అశోక్ సింఘాల్

హిందూ ఉద్యమ నేత అశోక్ సింఘాల్

గుర్గావ్: రామజన్మభూమి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించిన అశోక్ సింఘాల్, దళితుల కోసం ప్రత్యేక దేవాలయాలను నిర్మించడంతో స్ఫూర్తిదాయక పాత్రను నిర్వహించారు. దేవాలయాల్లోకి ప్రవేశం లేదంటూ అగ్రవర్గాల ఛీత్కారాలను ఛీదరించుకొని పరమతాన్ని ఆశ్రయిస్తున్న సమయంలో దళితుల కోసం ప్రత్యేక దేవాలయాల నిర్మాణానికి ఉద్యమించారు. అలా దాదాపు 200 దేవాలయాలను నిర్మించారు. ఆరెస్సెస్‌తో ప్రారంభమైన ఆయన హిందూ మతోద్ధరణ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్కు ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకునే వరకు కొనసాగింది.

1926, సెప్టెంబర్ 15వ తేదీన ఆగ్రాలో జన్మించిన అశోక్ సింఘాల్ 1950లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. ఆయన 1942లోనే ఆరెస్సెస్‌లో చేరారు. పట్టభద్రుడయ్యాక ఫుల్‌టైమ్ ప్రచారక్‌గా మారారు. ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో చురుకైన ప్రచారక్‌గా ప్రశంసలు అందుకున్నారు. ఢిల్లీ, హర్యానాలకు ప్రంత్ ప్రచారక్‌గా మారారు. 1980లో విశ్వహిందూ పరిషద్‌కు బదిలీ అయ్యారు. సంయుక్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1984లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆయన 1984లో నిర్వహించిన వీహెచ్‌పీ ధర్మ సంసద్‌కు వందలాది మంది సాధువులు, హిందూ స్కాలర్లు హాజరయ్యారు. దేశంలో హిందూ మతాన్ని పునరుద్ధరించేందుకు ఆయన ఈ సంసద్‌లో సుదీర్ఘ చర్చలు జరపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందులో భాగంగానే పుట్టుకొచ్చిన రామజన్మభూమి ఉద్యమానికి ముఖ్య సారథిగా పనిచేశారు.

1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసిన ఆ ఉద్యమంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా 2011 వరకు బాధ్యతలు నిర్వహించారు. అనారోగ్య కారణాలతో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోగా, వీహెచ్‌పీ నాయకత్వ బాధ్యతలు మోహన్ భగవత్ స్వీకరించారు. మంచి గాత్ర శుద్ధిగల అశోక్ సింఘాల్, పండిట్ హోంకార్‌నాథ్ ఠాకూర్ వద్ద హిందూస్థాన్ మ్యూజిక్‌ను నేర్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement