Ashok Singhal
-
త్వరలో ఏపీకి 9 లక్షల కోవిడ్ టీకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలు భారీగా చేస్తున్నారు. గత 24 గంటల్లో 1,16,367 మందికి కరోనా పరీక్షలు చేయగా వాటిలో 22,204 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 85 మంది కరోనాతో బాధపడుతూ మృతి చెందారు. ప్రభుత్వాస్పత్రుల్లో 18,037 రెమిడెసివిర్ అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి అశోక్ సింఘాల్ బుధవారం ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 11,556 రెమిడెసివిర్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 387 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశామని ఏకే సింఘాల్ తెలిపారు. 3,220 మంది వైద్యులు 104 కాల్ సెంటర్ ద్వారా టెలీ కన్సల్టెంట్స్ ఇస్తున్నారని చెప్పారు. కేంద్రం ఏపీకి 4,800 రెమిడెసివిర్ వయల్స్ కేటాయించిందని వెల్లడించారు. మే నెల కోటా కింద 9 లక్షల కోవిడ్ టీకాలు రానున్నాయని పేర్కొన్నారు. 13 లక్షల డోసులు కేంద్రం నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఏకే సింఘాల్ హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. చదవండి: ‘కేసీఆర్ బయటకు రా.. ప్రజల కష్టాలు చూడు’ చదవండి: కరోనాపై యుద్ధం ప్రకటించిన మమత -
అయోధ్య తీర్పు: వారిదే ఘనత
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, రామ జన్మభూమి రథయాత్రలో కీలక పాత్రధారి కేఎన్ గోవిందాచార్య స్వాగతించారు. ఈ కేసులో తీర్పు తమకు అనుకూలంగా రావడానికి విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత అశోక్ సింఘాల్, ఎల్కే అద్వానీ చేసిన కృషే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు తుది తీర్పు చాలా సంతోషం కలిగించింది. ఇక మూడు నెలల్లో రామమందిరం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాల’ని ఆయన అన్నారు. ప్రజలంతా సంయమనంతో మెలగాలని, మత సామరస్యం పాటించాలని కోరారు. ఈ విజయానికి ప్రధాన కారణం ఎవరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. ‘ఆలయ నిర్మాణం కోసం లక్షలాది మంది త్యాగాలు చేశారు. చాలా మంది అనేక రకాలుగా రామ జన్మభూమి ఉద్యమంలో తమ పాత్ర పోషించారు. కీలక భూమిక మాత్రం అశోక్ సింఘాల్, ఎల్కే అద్వానీదే’ అని సమాధానం ఇచ్చారు. అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని హిందూ మహాసభ తరపు న్యాయవాది వరుణ్‌కుమార్ సిన్హా వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం సందేశాన్ని ఇచ్చేలా తీర్పు ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు బాలెన్స్డ్గా ఉందని, ఇది ప్రజల విజయమని రామ్ లల్లా తరపు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ అన్నారు. (చదవండి: సుప్రీంతీర్పును గౌరవిస్తున్నాం.. కానీ) -
సీఎం పదేపదే అదే చెప్పారు: టీటీడీ ఈవో
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో నగల మాయం వ్యవహారం, అర్చకుల మధ్య విబేధాలు తదితర పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం టీటీడీ ముఖ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో భేటీ అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. వివాదాలకు సంబంధించి సీఎం ఏం చెప్పారో వివరించారు.. (చదవండి: లేని వజ్రాన్ని తెమ్మంటే ఎలా?: పుట్టా) సీఎం గట్టిగా చెప్పారు: ‘‘టీటీడీలో అన్ని పనులూ చట్టప్రకారం, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం జరుగుతున్నాయి. నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని చెప్పగలుగుతున్నాం. ఇకపోతే సమావేశంలో సీఎంగారు మాకు పదేపదే ఒకే విషయాన్నిగుర్తుచేశారు. వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రతకు ఎక్కడా భంగం వాటిల్లకుండా, భక్తుల మనోభావాలు గాయపడకుండా చూసుకోవాలని చెప్పారు. అదేసమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగొద్దని ఆదేశించారు. ఆయా రోజులకు సంబంధించి స్వామివారి కైంకర్యాల వేళల్లో ఎలాంటి మార్పులు చేయలేదని మేం సీఎంకు వివరించాం’’ అని సింఘాల్ తెలిపారు. ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే ప్రదర్శిస్తాం: 1952 నుంచి శ్రీవారి ఆభరణాలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని టీటీడీ ఈవో చెప్పారు. ‘‘2011 జనవరి 20న టీటీడీ వేసిన రిటైర్డ్ జడ్జీల కమిటీ కూడా ఆభరణాలన్నీ ఉన్నాయని తేల్చింది. కానీ శ్రీకృష్ణ దేవరాయల ఆభరణాలు యేవో ఆ కమిటీ తేల్చలేకపోయింది. ప్రతి ఏడాది ఆభరణాల తనిఖీ జరుగుతూనే ఉంటుంది. ఒక్క మిల్లీ గ్రాము అటూ ఇటైనా రికార్డుల్లోకి వస్తాయి. శ్రీవారి ఆభరణాల జాబితా ఇప్పటికే ఇచ్చాం. ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రచారంలో ఉన్నట్లు గులాబీ వజ్రం ఏదీ లేదు. రూబీ మాత్రమే ఉంది. అదికూడా భక్తులు విసిరిన నాణేలు తగిలి పగిలిపోయింది’’ అని అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. కాగా, సీఎంతో భేటీకి ముందు ఈవో మీడియాకు ఏం చెప్పారో, సమావేశం తర్వాత కూడా అదే చెప్పడం గమనార్హం. తద్వారా శ్రీవారి నగల మాయంపై వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు ఎలాంటి చర్యలుగానీ, విచారణగానీ చేపట్టబోవడంలేదని తెలుస్తున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. -
అశోక్ సింఘాల్‌కు ప్రముఖుల నివాళి
-
అశోక్ సింఘాల్ కన్నుమూత
గుర్గావ్లోని ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస ♦ రామజన్మభూమి ఉద్యమంలో కీలక భూమిక ♦ ఆరెస్సెస్, వీహెచ్‌పీల్లో వివిధ హోదాల్లో విధులు ♦ సింఘాల్ మృతి వ్యక్తిగతంగా తీరని లోటన్న ప్రధాని మోదీ గుర్గావ్: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) సీనియర్ నేత, రామజన్మభూమి ఉద్యమ సారథి అశోక్ సింఘాల్ కన్ను మూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో బాధ పడుతున్న సింఘాల్(89) మంగళవారం మధ్యాహ్నం 2.24 గంటలకు స్థానిక మెడాంట మెడిసిటీ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రఇబ్బంది, ఇతర సమస్యలతో నవంబర్ 14న ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి కృత్రిమ శ్వాసపైననే ఉన్నారు. గుండె రక్త నాళాల వైఫల్యం, రక్తం విషపూరితం అవడమనే సమస్యల వల్ల సింఘాల్ మృతి చెందారని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా వెల్లడించారు. సింఘాల్ మృతదేహాన్ని ఢిల్లీలోని జండేవాలన్లో ఉన్న ఆరెస్సెస్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ప్రజల సందర్శనార్ధం బుధవారం మధ్యాహ్నం 3 గం. వరకు సింఘాల్ మృతదేహాన్ని అక్కడే ఉంచుతామని, అనంతరం నిగంబోధ్ స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని తొగాడియా వెల్లడించారు. 1980 దశకం చివర్లలో ప్రారంభమైన రామజన్మభూమి ఉద్యమాన్ని దేశ, విదేశాల్లో విస్తృతం చేయడంలో అశోక్ సింఘాల్‌ది కీలక పాత్ర. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ‘కరసేవ’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా నిర్వహించారు. ఆ నేపథ్యంలోనే 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు విధ్వంస ఘటన చోటు చేసుకుంది. రామజన్మభూమి కోసం వీహెచ్‌పీ చేపట్టిన ప్రచారానికి విదేశాల నుంచి నిధులు సేకరించడంలో సింఘాల్ కృషి గణనీయమైనది. వ్యక్తి కాదు.. వ్యవస్థ: మోదీ అశోక్ సింఘాల్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సింఘాల్ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. దేశసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన అశోక్ సింఘాల్ ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థ అని అభివర్ణించారు. పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల వెనుక చోదక శక్తి సింఘాలేనని, ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు. సింఘాల్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన సానుభూతిని తెలిపారు. సింఘాల్ మృతి తననెంతో బాధకు గురి చేసిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సంతాపం తెలిపారు. ఐదు దశాబ్దాల ప్రజా జీవితం ఆయనను ఒక వ్యవస్థగా మార్చిందన్నారు. రాజస్తాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్, గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లి, గుజరాత్ సీఎం ఆనంది బెన్ పటేల్, రాజస్తాన్ బీజేపీ నేతలు, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్.. తదితరులు సింఘాల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సింఘాల్‌ను అజాత శత్రువుగా అభివర్ణించిన కళ్యాణ్ సింగ్.. ఆయన మృతి సమాజానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. బ్రహ్మచారి.. హిందూత్వ యోధుడు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 1926 అక్టోబర్ 2న అశోక్ సింఘాల్ జన్మించారు. చిన్నతనం నుంచే హిందూత్వ విశ్వాసాలున్న సింఘాల్ 1942లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో చేరారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి మెటలర్జీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఆరెస్సెస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా పనిచేయడం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఆ తరువాత ఢిల్లీ, హర్యానాలకు ఆరెస్సెస్ ప్రాంత ప్రచారక్ అయ్యారు. 1980లో సంఘ్ పరివార్‌లో భాగమైన విశ్వహిందూ పరిషత్‌లో సంయుక్త ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. 1984లో వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తరువాత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితుడై డిసెంబర్ 2011 వరకు ఆ హోదాలో పనిచేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం లక్ష్యంగా సాగించిన రామ జన్మభూమి ఉద్యమాన్ని అన్నీ తానై నడిపించిన సింఘాల్.. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. సింఘాల్ మృతికి రాష్ట్ర బీజేపీ నేతల సంతాపం సాక్షి, హైదరాబాద్: విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్‌సింఘాల్ మృతికి బీజేపీ రాష్ట్ర నేతలు సంతాపాన్ని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభపక్షం నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో తమ సానుభూతిని, దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. -
హిందూ ఉద్యమ నేత అశోక్ సింఘాల్
గుర్గావ్: రామజన్మభూమి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించిన అశోక్ సింఘాల్, దళితుల కోసం ప్రత్యేక దేవాలయాలను నిర్మించడంతో స్ఫూర్తిదాయక పాత్రను నిర్వహించారు. దేవాలయాల్లోకి ప్రవేశం లేదంటూ అగ్రవర్గాల ఛీత్కారాలను ఛీదరించుకొని పరమతాన్ని ఆశ్రయిస్తున్న సమయంలో దళితుల కోసం ప్రత్యేక దేవాలయాల నిర్మాణానికి ఉద్యమించారు. అలా దాదాపు 200 దేవాలయాలను నిర్మించారు. ఆరెస్సెస్‌తో ప్రారంభమైన ఆయన హిందూ మతోద్ధరణ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్‌కు ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకునే వరకు కొనసాగింది. 1926, సెప్టెంబర్ 15వ తేదీన ఆగ్రాలో జన్మించిన అశోక్ సింఘాల్ 1950లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. ఆయన 1942లోనే ఆరెస్సెస్‌లో చేరారు. పట్టభద్రుడయ్యాక ఫుల్‌టైమ్ ప్రచారక్‌గా మారారు. ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో చురుకైన ప్రచారక్‌గా ప్రశంసలు అందుకున్నారు. ఢిల్లీ, హర్యానాలకు ప్రంత్ ప్రచారక్‌గా మారారు. 1980లో విశ్వహిందూ పరిషద్‌కు బదిలీ అయ్యారు. సంయుక్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1984లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆయన 1984లో నిర్వహించిన వీహెచ్‌పీ ధర్మ సంసద్‌కు వందలాది మంది సాధువులు, హిందూ స్కాలర్లు హాజరయ్యారు. దేశంలో హిందూ మతాన్ని పునరుద్ధరించేందుకు ఆయన ఈ సంసద్‌లో సుదీర్ఘ చర్చలు జరపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందులో భాగంగానే పుట్టుకొచ్చిన రామజన్మభూమి ఉద్యమానికి ముఖ్య సారథిగా పనిచేశారు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసిన ఆ ఉద్యమంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా 2011 వరకు బాధ్యతలు నిర్వహించారు. అనారోగ్య కారణాలతో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోగా, వీహెచ్‌పీ నాయకత్వ బాధ్యతలు మోహన్ భగవత్ స్వీకరించారు. మంచి గాత్ర శుద్ధిగల అశోక్ సింఘాల్, పండిట్ హోంకార్నాథ్ ఠాకూర్ వద్ద హిందూస్థాన్ మ్యూజిక్‌ను నేర్చుకున్నారు. -
ఆగ్రా నుంచి అంతర్జాతీయ స్థాయికి..
చాలా పాత సామెత. కొండ.. మహమ్మద్ వద్దకు రాకుంటే మహమ్మదే కొండ వద్దకు వెళ్లాలి. వందల ఏళ్లుగా అగ్రకులాల చేతుల్లో, చేతలతో నలిగిపోయిన అణగారిన వర్గాల జీవితాల్లో ఆథ్యాత్మిక వెలుగులు నింపాలంటే ఏం చేయాలి? ప్రవాహంలా సాగిపోతున్న మత మార్పిడులకు అడ్డుకట్ట ఎలా వేయాలి? ఇలాంటి చాలా ప్రశ్నలకు తెలివైన, ఆచరణ యోగ్యమైన సూచనలు చేసి, అమలు పరిచారు అశోక్ సింఘాల్. దళిత బహుజనుల కోసం ప్రత్యేకంగా హైందవ ఆలయాలు నిర్మించాలన్న ఆయన సూచన మతమార్పిడులను చాలా వరకు నిరోధించిందనే చెప్పాలి. సింఘాల్ 1926, సెప్టెంబర్ 15న ఆగ్రాలో జన్మించారు. తండ్రి బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి. సౌకర్యాలు కలిగిన కుటుంబం కావడంతో అశోక్ విద్యాభ్యాసం నిరాటంకంగా సాగింది. 1942 నుంచే.. అంటే కళాశాల విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రచారక్ గా పనిచేశారు. 1950లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెటలర్జికల్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. డిగ్రీ పూర్తవుతూనే ఫుల్ టైమ్ ప్రచారక్ గా మారిపోయారు. అప్పటికే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ప్రచారక్ విధులు నిర్వహించిన ఆయన అనతికాలంలోనే ప్రాంత్ ప్రచారక్ గా ఎదిగారు. యూపీ, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు ప్రాంత ప్రచారక్ గా విశేష సేవలందించారు. 1980లో సంఘ్ పరివార్ లో అంతర్భాగాలైన ఆర్ఎస్ఎస్ నుంచి వీహెచ్‌పీకి బదిలీ అయ్యారు. జాయింట్ జనరల్ సెక్రటరీగా వీహెచ్‌పీలో ప్రస్థానం ప్రారంభించిన సింఘాల్ జనరల్ సెక్రటరీగా, వర్కింగ్ ప్రెసిడెంట్, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆయన జమానాలోనే వీహెచ్‌పీ తిరుగులేని హిందూత్వ శక్తిగా ఎదిగింది. ప్రధానంగా విద్యావంతులను ఆకర్షించడంలో స్వతహాగా ఇంజనీర్ అయిన అశోక్ కృషి గణనీయమైనది. పండిట్ ఓంకార్ నాథ్ ఠాకూర్ వద్ద సంగీత పాఠాలు నేర్చిన అశోక్.. హిందూస్థానీ సంగీతంలో విశేష ప్రావీణ్యాన్ని సొంతం చేసుకున్నారు. 1981లో తమిళనాడులో చోటుచేసుకున్న మతమార్పిడులతో కలత చెందిన ఆయన.. అణచివేతకు గురైన దళితులు.. ఇస్లామ్ సహా ఇతర మతాల్లోకి మారకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. ఆ క్రమంలోనే తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో దళితుల కోసం ప్రత్యేకంగా 200 ఆలయాలు నిర్మించారు. ఈ చర్య మతమార్పిడులను చాలామేరకు నిరోధించింది. చివరి రక్తపు బొట్టు వరకు.. అన్నట్లు చేతనైనంత కాలం హిందువులను చైతన్యపరిచిన ఆయన అనారోగ్యం కారణంగా 2011లో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన వారసుడిగా ప్రవీణ్ తొగాడియా కొనసాగుతుండటం తెలిసిందే. కొద్ది నెలలుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆయన గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం చనిపోయారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్ కన్నుమూత
-
మెరుగు పడిన అశోక్ సింఘాల్ ఆరోగ్యం
న్యూఢిల్లీ : విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. గుర్గావ్ లోని మెదాంత మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్ సింఘాల్‌ను ఈ రోజు ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సింఘాల్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడాలిని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గత రాత్రి అశోక్ సింఘాల్ శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన్ని మెదాంత ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. గతనెల్లో నవరాత్రి పూజ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నగరంలో హువాన్ పూజ జరుపుతున్న సయమంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఏయిర్ అంబులెన్‌లో గుర్గావ్లోని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. -
అశోక్ సింఘాల్‌కు అస్వస్థత
గుర్గావ్: విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను గుర్గావ్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంవల్లే ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిమితంగానే ఉందని, అయితే, తప్పనిసరిగా తమ పరిశీలనలో ఉండాలని చెప్పారు. నవరాత్రి పూజ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ పట్టణానికి అశోక్ సింఘాల్ వెళ్లారు. హువాన్ పూజ జరుపుతున్న సమయంలో తనకు ఊపిరి ఆడటం లేదని, శ్వాస తీసుకోవడం ఇబ్బందవుతుందని ఆయన చెప్పిన వెంటనే ఎయిర్ అంబులెన్స్ ద్వారా గుర్గావ్ ఆస్పత్రికి తరలించారు. -
'అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి'
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కోరారు. మందిర నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులపై చర్చించేందుకు వచ్చే జనవరిలో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో రామమందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చిందని అశోక్ సింఘాల్, సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ప్రకటించాలని కోరారు. లేదంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. -
'సత్యసాయి ప్రవచనం నిజమవుతుంది'
న్యూఢిల్లీ: దేశ భవిష్యత్తుకు సంబంధించి భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన ప్రవచనం నెరవేరుతుందని, ఆ మేరకు పరిస్థితుల్లోనూ మార్పులు సంభవించాయని విశ్వహిందూ పరిషత్ అగ్రనేత అశోక్ సింఘాల్ అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అఖండ మెజారిటీ సాధించడాన్ని విప్లవంగా అభివర్ణించిన ఆయన .. 2020లోగా భారత్ హిందూ దేశంగా రూపాంతరం చెందడం ఖాయమన్నారు. శనివారం ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్, దివంగత సుదర్శన్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సింఘాల్ ప్రసంగించారు. 'సత్యసాయి బాబా బతికున్న రోజుల్లో ఓ సారి నేను ఆయన ఆశ్రమానికి వెళ్లాను. 2020 నాటికి భారత దేశం సంపూర్ణ హిందూ దేశంగా మారుతుందని, 2030 నాటికి ప్రపంచం మొత్తం హిందూమయమవుతుందని బాబా నాతో అన్నారు. ఆయన మాటలు నిజం కాబోతున్నాయనడానికి నిదర్శనం నేటి బీజేపీ గెలుపు' అని సింఘాల్ చెప్పారు. -
దేశంలో హిందూ పాలన
800 ఏళ్ల తర్వాత హిందువులమని గర్వించే వారు గద్దెనెక్కారు: సింఘాల్ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కడంతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆనందడోలికల్లో మునిగి తేలుతోంది. దేశ రాజధాని ఢిల్లీని 800 ఏళ్ల తర్వాత హిందువులమని గర్వించే వారుపాలించేందుకు వచ్చారని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీని చివరిసారిగా హిందూ రాజు పృథ్వీరాజ్ చవాన్ ఎనిమిది శతాబ్దాల కిందట పాలించారని గుర్తుచేశారు. శుక్రవారం ఢిల్లీలో మూడు రోజుల ప్రపంచ హిందూ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సింఘాల్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీలు) జర్మన్ తొలగింపు వివాదాన్ని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. ‘సంస్కృతాన్ని తొలగించాలనుకోవడం దేశాన్ని తొలగించడం వంటిది’’ అని సింఘాల్ పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్‌భాగవత్ మాట్లాడుతూ హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి విలువలతో కూడిన నాయకత్వం గురించి ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు. బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రసంగిస్తూ బౌద్ధం, హిందూ మతాలను ఆధ్యాత్మిక సోదరులుగా అభివర్ణించారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని చాటడంలో ప్రాచీన హిందూవిలువలుకీలకపాత్ర పోషిస్తాయన్నారు. రాజ్యాంగ విరుద్ధం.. కాంగ్రెస్: సింఘాల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుబట్టింది. మతరాజకీయాలు రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంది. దేశ ప్రధానులుగా సేవలు అందించిన పి.వి., వాజ్‌పేయి, దేవెగౌడలు హిందువులు కాదా? అని కాంగ్రెస్ ప్రతినిధి శక్తిసిన్హ్ ప్రశ్నించారు. -
అయోధ్యలో రామాలయం కట్టాల్సిందే: వీహెచ్‌పీ
అయోధ్యలో రామాలయాన్ని వీలైనంత త్వరగా కట్టి తీరాల్సిందేనని వీహెచ్‌పీ నాయకుడు అశోక్ సింఘాల్ మరోసారి అన్నారు. బీజేపీ మాజీ ఎంపీ, 'శిలాన్యాసం' మూలపురుషుడు అయిన మహంత్ అవైద్యనాథ్ స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అయితే.. అదే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రం దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. గోరఖ్‌నాథ్ ఆలయం మాజీ ప్రధాన పూజారి కూడా అయిన మహంత్ అవైద్యనాథ్ స్మారకార్థం ఓ శ్రద్ధాంజలి సభను నిర్వహించారు. మహంత్జీ ఆశయాల మేరకు ఆలయాన్ని వీలైనంత త్వరగా కట్టాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ సింఘాల్ అన్నారు. దీనిపై విలేకరులు అమిత్ షాను ప్రశ్నించగా, ఆయన మాత్రం నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. అవైద్యనాథ్ గొప్ప సంఘ సంస్కర్త అని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. -
'హిందు సంస్కృతిని సోనియా నాశనం చేస్తున్నారు'
హైదరాబాద్: హిందూ సంస్కృతిని నాశనం చేయడానికే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కంకణం కట్టుకున్నారని వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్ మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న గందరగోళ పరిస్థితులకు సోనియానే కారణమని ఆయన విమర్శించారు. రూపాయి రోజు రోజూకు దిగజారిపోతున్నతరుణంలో ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని సింఘాల్ తెలిపారు. డాలర్ మారకంతో రూపాయి క్షీణదశకు చేరుకోవడానికి కారణం కూడా సోనియా గాంధీయేనన్నారు. ఆధ్మాతిక గురువు ఆశారాం బాపూపై కేసులు పెట్టి వేధించడం వెనకు కాంగ్రెస్ కుట్ర దాగుందని ఆయన తెలిపారు. 80 ఏళ్లకు పైబడిన ఆశారాంపై లైంగిక వేధింపుల కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని సింఘాల్ అభిప్రాయపడ్డారు. -
లక్నోలో సింఘాల్, అయోధ్యలో తొగాడియా అరెస్ట్!
విశ్వ హిందు పరిషత్ నాయకులు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియాలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ నాయకులు చేపట్టిన 'చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర'ను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ సింఘాల్ ను లక్నోలో అరెస్ట్ చేయగా, తొగాడియాను అయోధ్యలో అదుపులోకి తీసుకున్నారు. 'చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర'ను అడ్డుకుంటున్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపట్నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్టు అయోధ్యలోని గోలాఘాట్ లో అరెస్టైన తర్వాత తొగాడియా ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ప్రత్యక్షపోరాటానికి దిగిన విశ్వహిందూ పరిషత్.. అయోధ్య యాత్రను ప్రారంభించింది. పరిషత్ జాతీయ నాయకుడు ప్రవీణ్ తొగాడియా సహా దాదాపు 500 మంది వీహెచ్‌పీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఓ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఉన్నారు. రామ జన్మభూమి న్యాస్ కమిటీ చైర్మన్ మహంత్ నృత్య గోపాలదాస్ ఈ యాత్రను అయోధ్యలోని మణిరాం చవానీ (అఖాడా) నుంచి ప్రారంభించారు. కానీ యాత్ర కొద్ది దూరం వెళ్లేలోపే పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. తమ యాత్రను రాజకీయం చేయడం తగదని, ఇది కేవలం ఒకటి రెండు రోజులకు సంబంధించినది కాదని, ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటుందని గోపాలదాస్ తెలిపారు. యాత్ర చేసి తీరుతామని వీహెచ్‌పీ ప్రకటించిన నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. దుకాణాలు మొత్తం మూసేశారు. నయాఘాట్ ప్రాంతమంతా పోలీసు వయలంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది వీహెచ్‌పీ మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు. -
వీహెచ్‌పీ యాత్ర: మాజీ ఎంపీ, ఎమ్మెల్యేల అరెస్టు
విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన అయోధ్య యాత్ర నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ రాం విలాస్ వేదాంతి, ప్రస్తుత ఎమ్మెల్యే రామచంద్ర యాదవ్‌లను ఆదివారం తెల్లవారుజామున అరెస్టుచేశారు. ఎంతమందిని అరెస్టు చేసినా, ఎంత నిర్బంధం విధించినా అయోధ్య యాత్ర మాత్రం కొనసాగి తీరుతుందని వీహెచ్‌పీ స్పష్టం చేస్తోంది. పరిక్రమ కోసం ఇంటి నుంచి ఉదయం 7 గంటలకు బయల్దేరగానే వేదాంతిని అరెస్టు చేశారు. రామచంద్ర యాదవ్‌నూ ఇక్కడే అరెస్టు చేశారు. అయోధ్య మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశారు. యాత్ర వల్ల మత సామరస్యం దెబ్బతింటుందన్న పేరుతో సమాజ్‌వాదీ ప్రభుత్వం ఈ యాత్రను నిషేధించింది. అయోధ్యలో కర్ఫ్యూ తరహా వాతావరణం ఏర్పడింది. వీహెచ్‌పీ నాయకులు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియాలకు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. -
అశోక్ సింఘాల్ గృహ నిర్బంధం
ఫైజాబాద్/లక్నో: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు అశోక్ సింఘాల్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం గృహ నిర్బంధంలో పెట్టింది. వీహెచ్‌పీ ఆదివారం అయోధ్యకు సాధు, సన్యాసులతో తలపెట్టిన 84 కిలోమీటర్ల పాదయాత్రపై నిషేధం అమలులో భాగంగా, 70 మంది వీహెచ్‌పీ నేతలపై అరెస్టు వారంట్లు జారీ చేసింది. అవాంఛనీయమైన సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఫైజాబాద్-అయోధ్య జంట పట్టణాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసింది. మత కలహాలు రేకెత్తే అవకాశాలు ఉన్నందున వీహెచ్‌పీ యాత్రపై నిషేధం విధించిన యూపీ సర్కారు, పొరుగు రాష్ట్రాలను ఈ అంశంలో ఇంటెలిజెన్స్ సహాయం కోరింది. అయోధ్యకు దారితీసే జిల్లా సరిహద్దులన్నింటినీ ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం మూసివేసింది. నిషేధాన్ని ఉల్లంఘించి అయోధ్య వైపు పాదయాత్రగా వచ్చే సాధువులను జిల్లా ప్రవేశ మార్గాల వద్దే అదుపులోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. -
వీహెచ్‌పీ యాత్రపై వివాదం
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆగస్టు 25న అయోధ్యకు తలపెట్టిన 84 కిలోమీటర్ల పాదయాత్రపై వివాదం మొదలైంది. ఈ యాత్రపై నిషేధం విధిస్తూ ఉత్తరప్రదేశ్ నిర్ణయం తీసుకోవడంపై వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తీవ్రంగా స్పందించారు. యాత్రపై నిషేధాన్ని అమలు చేసేందుకు బలప్రయోగానికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని యూపీ సర్కారును హెచ్చరించారు. ఒకవైపు, అయోధ్య యాత్రపై వీహెచ్‌పీకి బీజేపీ, ఆరెస్సెస్ బాసటగా నిలుస్తుండగా, మరోవైపు, కాంగ్రెస్, జేడీయూలు బీజేపీ, వీహెచ్‌పీలపై విమర్శలు సంధించాయి. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడటం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటోందని కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ యూపీ వ్యవహారాల ఇన్చార్జిగా గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సన్నిహితుడైన అమిత్ షాను నియమించిన నాటి నుంచి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ అన్నారు. మతతత్వ రాజకీయాలకు పాల్పడటం, ఒక వర్గం ఓట్లను కూడగట్టుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందాలన్నదే బీజేపీ మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహమని విమర్శించారు. యాత్రపై నిషేధాన్ని అమలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ అశోక్ సింఘాల్ యూపీ సర్కారును హెచ్చరించడాన్ని జేడీయూ తప్పుపట్టింది. ‘సింఘాల్ ఎవరు? హిందువులను ఆయనేమైనా గుత్తకు తీసుకున్నారా? ఈ వీహెచ్‌పీ ఏమిటి? హిందువులకు నేతృత్వం వహించే సంస్థగా వీహెచ్‌పీని ఎవరు ఆమోదిస్తారు?’ అంటూ జేడీయూ అధినేత శరద్ యాదవ్ మండిపడ్డారు. కాగా, యాత్రపై నిషేధం విధించడం సబబు కాదని బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు. మరోవైపు వీహెచ్‌పీ తలపెట్టిన యాత్రను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న దరిమిలా, ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.