ఆగ్రా నుంచి అంతర్జాతీయ స్థాయికి..
చాలా పాత సామెత. కొండ.. మహమ్మద్ వద్దకు రాకుంటే మహమ్మదే కొండ వద్దకు వెళ్లాలి. వందల ఏళ్లుగా అగ్రకులాల చేతుల్లో, చేతలతో నలిగిపోయిన అణగారిన వర్గాల జీవితాల్లో ఆథ్యాత్మిక వెలుగులు నింపాలంటే ఏం చేయాలి? ప్రవాహంలా సాగిపోతున్న మత మార్పిడులకు అడ్డుకట్ట ఎలా వేయాలి? ఇలాంటి చాలా ప్రశ్నలకు తెలివైన, ఆచరణ యోగ్యమైన సూచనలు చేసి, అమలు పరిచారు అశోక్ సింఘాల్. దళిత బహుజనుల కోసం ప్రత్యేకంగా హైందవ ఆలయాలు నిర్మించాలన్న ఆయన సూచన మతమార్పిడులను చాలా వరకు నిరోధించిందనే చెప్పాలి.
సింఘాల్ 1926, సెప్టెంబర్ 15న ఆగ్రాలో జన్మించారు. తండ్రి బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి. సౌకర్యాలు కలిగిన కుటుంబం కావడంతో అశోక్ విద్యాభ్యాసం నిరాటంకంగా సాగింది. 1942 నుంచే.. అంటే కళాశాల విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రచారక్ గా పనిచేశారు. 1950లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెటలర్జికల్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. డిగ్రీ పూర్తవుతూనే ఫుల్ టైమ్ ప్రచారక్ గా మారిపోయారు.
అప్పటికే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ప్రచారక్ విధులు నిర్వహించిన ఆయన అనతికాలంలోనే ప్రాంత్ ప్రచారక్ గా ఎదిగారు. యూపీ, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు ప్రాంత ప్రచారక్ గా విశేష సేవలందించారు. 1980లో సంఘ్ పరివార్ లో అంతర్భాగాలైన ఆర్ఎస్ఎస్ నుంచి వీహెచ్పీకి బదిలీ అయ్యారు.
జాయింట్ జనరల్ సెక్రటరీగా వీహెచ్పీలో ప్రస్థానం ప్రారంభించిన సింఘాల్ జనరల్ సెక్రటరీగా, వర్కింగ్ ప్రెసిడెంట్, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆయన జమానాలోనే వీహెచ్‌పీ తిరుగులేని హిందూత్వ శక్తిగా ఎదిగింది. ప్రధానంగా విద్యావంతులను ఆకర్షించడంలో స్వతహాగా ఇంజనీర్ అయిన అశోక్ కృషి గణనీయమైనది. పండిట్ ఓంకార్ నాథ్ ఠాకూర్ వద్ద సంగీత పాఠాలు నేర్చిన అశోక్.. హిందూస్థానీ సంగీతంలో విశేష ప్రావీణ్యాన్ని సొంతం చేసుకున్నారు.
1981లో తమిళనాడులో చోటుచేసుకున్న మతమార్పిడులతో కలత చెందిన ఆయన.. అణచివేతకు గురైన దళితులు.. ఇస్లామ్ సహా ఇతర మతాల్లోకి మారకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. ఆ క్రమంలోనే తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో దళితుల కోసం ప్రత్యేకంగా 200 ఆలయాలు నిర్మించారు. ఈ చర్య మతమార్పిడులను చాలామేరకు నిరోధించింది.
చివరి రక్తపు బొట్టు వరకు.. అన్నట్లు చేతనైనంత కాలం హిందువులను చైతన్యపరిచిన ఆయన అనారోగ్యం కారణంగా 2011లో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన వారసుడిగా ప్రవీణ్ తొగాడియా కొనసాగుతుండటం తెలిసిందే. కొద్ది నెలలుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆయన గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం చనిపోయారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.