విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆగస్టు 25న అయోధ్యకు తలపెట్టిన 84 కిలోమీటర్ల పాదయాత్రపై వివాదం మొదలైంది. ఈ యాత్రపై నిషేధం విధిస్తూ ఉత్తరప్రదేశ్ నిర్ణయం తీసుకోవడంపై వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తీవ్రంగా స్పందించారు.
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆగస్టు 25న అయోధ్యకు తలపెట్టిన 84 కిలోమీటర్ల పాదయాత్రపై వివాదం మొదలైంది. ఈ యాత్రపై నిషేధం విధిస్తూ ఉత్తరప్రదేశ్ నిర్ణయం తీసుకోవడంపై వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తీవ్రంగా స్పందించారు. యాత్రపై నిషేధాన్ని అమలు చేసేందుకు బలప్రయోగానికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని యూపీ సర్కారును హెచ్చరించారు. ఒకవైపు, అయోధ్య యాత్రపై వీహెచ్‌పీకి బీజేపీ, ఆరెస్సెస్ బాసటగా నిలుస్తుండగా, మరోవైపు, కాంగ్రెస్, జేడీయూలు బీజేపీ, వీహెచ్‌పీలపై విమర్శలు సంధించాయి. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడటం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటోందని కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ యూపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సన్నిహితుడైన అమిత్ షాను నియమించిన నాటి నుంచి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ అన్నారు.
మతతత్వ రాజకీయాలకు పాల్పడటం, ఒక వర్గం ఓట్లను కూడగట్టుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందాలన్నదే బీజేపీ మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహమని విమర్శించారు. యాత్రపై నిషేధాన్ని అమలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ అశోక్ సింఘాల్ యూపీ సర్కారును హెచ్చరించడాన్ని జేడీయూ తప్పుపట్టింది. ‘సింఘాల్ ఎవరు? హిందువులను ఆయనేమైనా గుత్తకు తీసుకున్నారా? ఈ వీహెచ్‌పీ ఏమిటి? హిందువులకు నేతృత్వం వహించే సంస్థగా వీహెచ్‌పీని ఎవరు ఆమోదిస్తారు?’ అంటూ జేడీయూ అధినేత శరద్ యాదవ్ మండిపడ్డారు. కాగా, యాత్రపై నిషేధం విధించడం సబబు కాదని బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు. మరోవైపు వీహెచ్‌పీ తలపెట్టిన యాత్రను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న దరిమిలా, ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.