మహిళా జర్నలిస్ట్‌కు సుప్రీం బాసట | Supreme Court Halts Actions Against Journalist in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

మహిళా జర్నలిస్ట్‌కు సుప్రీం బాసట

Published Fri, Oct 25 2024 4:22 AM | Last Updated on Fri, Oct 25 2024 6:04 AM

Supreme Court Halts Actions Against Journalist in Uttar Pradesh

మమతా త్రిపాఠిపై కఠిన చర్యలొద్దని ఆదేశం 

మీ వైఖరేంటో తెలియజేయండి 

యూపీ సర్కార్‌కు నోటీసులు 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ నియామకాల్లో రెండు కులాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని, ఇతర కులాల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శలు చేసినందుకు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లను ఎదుర్కొంటున్న మహిళా పాత్రికేయురాలు మమతా త్రిపాఠికి సర్వోన్నత న్యాయస్థానం బాసటగా నిలిచింది. 

ఆమెపై కఠిన చర్యలకు ఉపక్రమించకుండా సుప్రీంకోర్టు ఆమెకు రక్షణగా నిలిచింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. 

ఈ అంశంలో మమతపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ అంశంలో మీ వైఖరేంటో తెలపాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నోటీసులు జారీచేసింది. రాజకీయ దురుద్దేశంతో, పత్రికా స్వేచ్ఛను కాలరాసేందుకు కుట్రపన్ని మమతపై నేరసంబంధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారని ఈ సందర్భంగా మమత తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధా్దర్థ్‌ దవే వాదించారు.  

మమత చేసిన వ్యాఖ్యలేంటి? 
కొన్ని వారాల క్రితం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్‌’లో మమత పలు పోస్ట్‌లు పెట్టారు. వాటిల్లో ‘యాదవ్‌ రాజ్‌ వర్సెస్‌ ఠాకూర్‌(సింగ్‌)రాజ్‌’ అంటూ ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు వర్గాలకు మాత్రమే ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత దక్కుతోందని విమర్శించారు. అంతకుముందు మరో జర్నలిస్ట్‌ అభిõÙక్‌ ఉపాధ్యాయ్‌ సైతం యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ను విమర్శిస్తూ ఒక భారీ కథనాన్ని వెలువరిచారు. 

‘‘ అఖిలేశ్‌ యాదవ్‌ సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్ర మీడియా మొత్తం యాదవుల గురించే ప్రత్యేక కథనాలను వండివార్చింది. ఇక యోగి ఆదిత్యనాథ్‌ హయాంలో ఠాకూర్‌ల రాజ్యం గురించిన చర్చ కొనసాగుతోంది’’ అని ఆయన పోస్ట్‌చేశారు. అఖిలేశ్‌యాదవ్‌ కాలంలో యాదవులకే ప్రభుత్వ నియామకాల్లో అధిక ప్రాధాన్యత దక్కిందని, అలాగే యోగి హయాంలో ఠాకూర్‌లకు కీలక పదవులు దక్కాయని వ్యాఖ్యానించారు.

 ప్రస్తుతం కొలువుల్లో కొనసాగుతున్న సంబంధిత ఉన్నతాధికారుల జాబితాలో కొంత భాగాన్ని బహిర్గతంచేశారు. ‘కుల వివక్ష ఉందా? లేదంటే ఠాకూర్‌ కులస్తులకే కొలువులు కట్టబెడతారా?’ అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌పై స్పందిస్తూ మమత త్రిపాఠి మరికొన్ని పోస్ట్‌లుచేశారు. దీంతో ప్రభుత్వం వీరిపై కేసులు మోపింది. ప్రభుత్వం నేరుగా కేసులు బనాయించకుండా ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ పంకజ్‌ కుమార్‌ అనే వ్యక్తిమాటున ఫిర్యాదులు ఇప్పించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేయించిందని ఆరోపణలున్నాయి.

 ‘‘ ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభమైన పత్రికాస్వేచ్ఛను అణగదొక్కి నిజాలు, వాస్తవాభిప్రాయాలను అణచివేయలేరు. ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసినంత మాత్రాన ప్రభుత్వ తప్పులు ఒప్పులు అయిపోవు. ప్రభుత్వాలపై పాత్రికేయులు చేసే సద్విమర్శలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేయలేరని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)‘(భావప్రకటనాస్వేచ్చ) స్పష్టంచేస్తోంది’ అని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  

ఇటీవల మరో జర్నలిస్ట్‌కూ రక్షణ 
ఇదే ఉదంతంలో అక్టోబర్‌ 4న లక్నోకు చెందిన మరో జర్నలిస్ట్‌ అభిõÙక్‌ ఉపాధ్యాయ్‌ సైతం తనపై మోపిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోర్టును ఆశ్రయించిన విషయాన్ని న్యాయవాది దవే గుర్తుచేశారు. మమతపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో ఒకదాంట్లో అభిõÙక్‌ సహనిందితునిగా ఉన్నారని, ఈనెలలో ఆయనకు ఇచి్చనట్లే కఠిన చర్యల నుంచి రక్షణను మమతకు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ‘ఎక్స్‌’లో పోస్ట్‌లు పెట్టారన్న ఒకే ఒక్క కారణంతో పాత్రికేయులను ప్రభుత్వం వేధిస్తోందని ఆయన వాదించారు. దీంతో ‘‘ కేవలం ప్రభుత్వాన్ని విమర్శించారని పాత్రికేయులపై కేసులు మోపడం తగదు’ అని ఆనాడు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

పాత్రికేయుల హక్కులను రాజ్యాంగం రక్షిస్తోంది: సుప్రీం 
ఇటీవల మరో జర్నలిస్ట్‌ అభిషేక్‌కు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచి్చన సందర్బంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిందే. పాత్రికేయుల హక్కులకు రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 19(1) (ఏ) కింద రక్షణ ఉంది. పాత్రికేయుల రచనలు ప్రభుత్వానికి విమర్శలుగా అనిపించినంత మాత్రాన వారిపై ప్రభుత్వం నేర సంబంధకేసులు మోపడం తగదు’’ అని కోర్టు స్పష్టంచేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు 4 వారాలు వాయిదా వేసింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement