విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన అయోధ్య యాత్ర నేపథ్యంలో మాజీ ఎంపీ రాం విలాస్ వేదాంతి, ప్రస్తుత ఎమ్మెల్యే రామచంద్ర యాదవ్లను అరెస్టుచేశారు.
విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన అయోధ్య యాత్ర నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ రాం విలాస్ వేదాంతి, ప్రస్తుత ఎమ్మెల్యే రామచంద్ర యాదవ్లను ఆదివారం తెల్లవారుజామున అరెస్టుచేశారు. ఎంతమందిని అరెస్టు చేసినా, ఎంత నిర్బంధం విధించినా అయోధ్య యాత్ర మాత్రం కొనసాగి తీరుతుందని వీహెచ్పీ స్పష్టం చేస్తోంది.
పరిక్రమ కోసం ఇంటి నుంచి ఉదయం 7 గంటలకు బయల్దేరగానే వేదాంతిని అరెస్టు చేశారు. రామచంద్ర యాదవ్నూ ఇక్కడే అరెస్టు చేశారు. అయోధ్య మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశారు. యాత్ర వల్ల మత సామరస్యం దెబ్బతింటుందన్న పేరుతో సమాజ్వాదీ ప్రభుత్వం ఈ యాత్రను నిషేధించింది. అయోధ్యలో కర్ఫ్యూ తరహా వాతావరణం ఏర్పడింది. వీహెచ్పీ నాయకులు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియాలకు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.