మళ్లీ మంటలు.. భద్రతా వలయంలో అయోధ్య! | VHP's Dharma Sabha in Ayodhya to push for Ram temple construction | Sakshi
Sakshi News home page

మళ్లీ అయోధ్య మంటలు

Published Sun, Nov 25 2018 5:02 AM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

VHP's Dharma Sabha in Ayodhya to push for Ram temple construction - Sakshi

అయోధ్యలోని లక్ష్మణ్‌ ఖిలావద్ద కుటుంబ సభ్యులతో కలసి పూజలు చేస్తున్న ఉద్ధవ్‌ఠాక్రే

అయోధ్య: లోక్‌సభ ఎన్నికల్లోపే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఆలస్యం అవుతున్నందున కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి అయినా గుడి కట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆదివారం అయోధ్యలో ధర్మ సభ పేరుతో విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. శివసేన పార్టీ కూడా ఆదివారమే అయోధ్యలో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది.

దీంతో అయోధ్యలో 1992 నాటి ముస్లింలపై దాడి ఘటనలు మళ్లీ పునరావృతమవ్వొచ్చనే ఆందోళనతో అనేక మంది ముస్లింలు తమ ఇళ్లలోని ఆడవాళ్లను, పిల్లలను ఇతర ప్రాంతాలకు పంపించారు. కాగా, ఇవన్నీ బీజేపీ ఎన్నికల గిమ్మిక్కులనీ, లోక్‌సభ ఎన్నికలలోపు ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రాదు కాబట్టి హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ అనుబంధ సంస్థలు ఇలాంటి చర్యలకు దిగుతున్నాయని కొందరు స్వామీజీలు సైతం విమర్శిస్తున్నారు.

శారదా ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ మతపరమైన కట్టడాల నిర్మాణం ప్రభుత్వాల బాధ్యత కాదనీ, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికే ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ధర్మ సభ విషయంలో జోక్యం చేసుకోవాలనీ, అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించి భద్రత కల్పించాలని యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సుప్రీంకోర్టు ను కోరారు. అయోధ్యలో తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు పెంచుతున్న మూడో కార్యక్రమం ఇది.

1992లో కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చినప్పుడు, ఆ తర్వాత 2002 మార్చిలో మందిర నిర్మాణం కోసం శిలాదాన్‌ జరిగినప్పుడు కూడా అయోధ్యలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ధర్మసభకు మూడు లక్షల మందికి పైగా ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలు హాజరవుతారని సమాచారం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ధర్మసభ తర్వాత కూడా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తేకుంటే జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో అలహాబాద్‌లో ధర్మ సంసద్‌ను నిర్వహించి మందిర నిర్మాణంపై కేంద్రంతో ఆరెస్సెస్‌ తాడోపేడో తేల్చుకోనుంది.

కుంభకర్ణుడి నిద్ర నుంచి కేంద్రం లేవాలి: ఠాక్రే
ధర్మసభ కోసం శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘కలియుగ కుంభకర్ణుడు (ప్రధాని మోదీ లేదా ఆయన ప్రభుత్వం) నాలుగేళ్లుగా నిద్రపోతూనే ఉన్నాడు. నిద్ర నుంచి లేచి కేంద్రం వెంటనే రామాలయ నిర్మాణ తేదీలను ప్రకటించాలి. గుడి కట్టేందుకు చట్టమో, ఆర్డినెన్సో తేవాలి. అందుకు మా పార్టీ మద్దతు ఉంటుంది.  ముందు తేదీ చెప్పిన తర్వాతే మిగతావి మాట్లాడాలి’ అని కోరారు. శివసే న మహారాష్ట్ర నుంచి దాదాపు 3,000 మంది కార్యకర్తలను అయోధ్యకు తీసుకొచ్చినట్లు సమాచారం.

డ్రోన్లు, అదనపు బలగాలతో భద్రత
ధర్మసభ నేపథ్యంలో అయోధ్య భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఫైజాబాద్‌ జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. అయోధ్యలో 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించింది. పట్టణంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. డ్రోన్ల సాయంతో నిరంతర గస్తీ నిర్వహిస్తారు. 10 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, 42 కంపెనీల పీఏసీ, ఐదు కంపెనీల ఆర్‌ఏఎఫ్, ఏటీఎస్‌ బలగాలను మోహరించినట్టు అయోధ్య ఏఎస్పీ సంజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఒక అదనపు డీజీపీ, ఒక డీఐజీ, ముగ్గురు సీనియర్‌ ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలు, 21 మంది డెప్యూటీ ఎస్పీలు, 160 మంది ఇన్‌స్పెక్టర్లు, 700 మంది కానిస్టేబుళ్లు కూడా ప్రత్యేక విధుల్లో ఉన్నారు. సరయూ నది మీదుగా కూడా పరిస్థితుల్ని సమీక్షించడానికి బలగాల్ని మోహరించారు.

ప్రశాంతంగా బతకనివ్వండి: ముస్లిం పిటిషనర్‌
ధర్మసభకోసం ప్రభుత్వం చేసిన భద్రతా ఏర్పాట్లు తనకు సంతృప్తినిస్తున్నాయని బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన ఇక్బాల్‌ అన్సారీ అన్నారు. అయితే, ఏమైనా సమస్యలుంటే వాటి పరిష్కారానికి లక్నోకో, ఢిల్లీకో వెళ్లాలి. అయోధ్యలో ఏం పని? ఇక్కడి ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వండి’ అని అన్సారీ పేర్కొన్నారు. ‘అయోధ్యలోని 5 వేల మంది ముస్లింలలో 3,500 మంది ప్రాణభయంతో వెళ్లిపోయారు’ అని వెల్లడించారు. మరోవైపు రామాలయం అంశం ఇంకా కోర్టులో ఉన్నప్పటికీ వీహెచ్‌పీ ధర్మ సభ నిర్వహిస్తోందనీ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం సుప్రీంకోర్టుకు లేఖ రాసింది.

ఆరెస్సెస్‌ నాలుగంచెల వ్యూహం
లోక్‌సభ ఎన్నికల్లోపే రామాలయాన్ని నిర్మించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆరెస్సెస్‌ నాలుగు అంచెల వ్యూహాన్ని రచించింది. అవి..
     
మొదటి దశ: నవంబర్‌ 25న దేశవ్యాప్తంగా 153 ప్రాంతాల్లో సభలు. అయోధ్య, నాగపూర్, బెంగళూరులో ధర్మసభలు.
 
రెండో దశ: ఆర్డినెన్స్‌ కోసం ఎంపీలపై ఒత్తిడి పెంచేందుకు పార్లమెంటు నియోజకవర్గాల్లో కార్యకర్తలు, సాధువులతో సభల ఏర్పాటు.

మూడో దశ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు, డిసెంబర్‌ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ.

నాలుగో దశ: డిసెంబర్‌ 18 నుంచి 27 వరకు మందిర నిర్మాణానికి దేశవ్యాప్త ఉద్యమం. యజ్ఞయాగాలు, ప్రార్థనలు నిర్వహిస్తారు.


అయోధ్య వీధుల్లో భద్రతా సిబ్బంది పహారా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement