అయోధ్యలో ‘ధర్మసభ’ వేదికపై ఆసీనులైన సాధువులు
అయోధ్య: రామ మందిర నిర్మాణం డిమాండ్‌తో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం నిర్వహించిన ధర్మసభకు లక్షలాది మంది రామభక్తులు హాజరయ్యారు. పండితుల మంత్రోచ్ఛరణలతో ధర్మసభ ప్రారంభమైంది. అనంతరం నిర్మోహి అఖాడాకు చెందిన రాంజీ దాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో జరిగే కుంభమేళాలోనే రామాలయ నిర్మాణ తేదీలపై ప్రకటన ఉంటుందని అన్నారు. ‘ఇంకొన్ని రోజులే. అందరూ ఓపికతో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
వీహెచ్‌పీ సీనియర్ నేత చంపత్ రాయ్ ప్రసంగిస్తూ వివాదంలో చిక్కుకున్న భూమిని హిందు, ముస్లిం సంస్థల మధ్య భాగాలుగా పంచేందుకు తాము ఒప్పుకోమనీ, మొత్తం స్థలం తమకే కావాలనీ, ఇక్కడి మొత్తం భూభాగంలో ఆలయం కడతామని అన్నారు. వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా పంచుతూ గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ మాట్లాడుతూ ‘ఇక్కడకు వచ్చిన ఇంత మంది జనాలను చూస్తుంటే వివిధ వర్గాల ప్రజలకు రామాలయంతో ఎంత అనుబంధం ఉందో తెలుస్తోంది’ అని పేర్కొన్నారు.
‘మేం కోర్టులను గౌరవిస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై మాకు ఎన్నో ఆశలున్నాయి. రామాలయ నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయాల్సిందిగా ఆదిత్యనాథ్‌ను నేను కోరుతున్నా’ అని గోపాల్‌దాస్ తెలిపారు. రామ్ భద్రాచార్య అనే ఓ నాయకుడు మాట్లాడుతూ గత శుక్రవారమే తాను ఓ కేంద్ర మంత్రిని కలిసి ఆయోధ్యపై మాట్లాడాననీ, డిసెంబర్ 11న ఎన్నికల నింబధనావళి కాలం ముగియగానే కేంద్ర మంత్రివర్గం సమావేశమై రామ మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ మంత్రి తనకు చెప్పారని తెలిపారు.
పండుగ వాతావరణం
ధర్మసభ వేదిక అంతా కాషాయ జెండాలు, రంగుల కాగితాలు, ప్లకార్డులతో నిండిపోయింది. అయోధ్యలో పండుగ వాతావరణం కనిపించింది. ధర్మసభకు అన్ని వర్గాల నుంచి మూడు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని వీహెచ్‌పీ తెలిపింది. ఐదు గంటలపాటు జరిగిన ఈ సభకు వివిధ ఆశ్రమాలు, అఖాడాలకు చెందిన దాదాపు 50 మంది స్వామీజీలు హాజరయ్యారు.
హరిద్వార్, ఛత్తీస్‌గఢ్, రిషికేశ్, ఉజ్జయిని, గుజరాత్, చిత్రకూట్, ప్రయాగ్‌రాజ్, లక్నో తదితర ప్రదేశాల నుంచి సన్యాసులు ధర్మసభకు వచ్చారని అయోధ్యలోని నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రామ్‌దాస్ తెలిపారు. అయోధ్య జిల్లా పంచాయతీ సభ్యుడు బబ్లూ ఖాన్ నేతృత్వంలో కొందరు ముస్లింలు కూడా ధర్మసభలో పాల్గొన్నారు. బబ్లూఖాన్ మాట్లాడుతూ ‘రామ మందిరం ఉద్యమంలో నేను గత మూడేళ్లుగా పాల్గొంటు న్నా. అయోధ్యలోని ముస్లింలు కూడా ఇక్కడ రామాలయం కట్టాలని కోరుకుంటున్నారని నేను భావిస్తున్నా. నేనూ ముస్లింనే. ఇక్కడ రామ భక్తులకు స్వాగతం పలుకుతున్నా’ అని చెప్పారు.
చట్టం తేవాలి: భాగవత్
మందిర నిర్మాణం కోసం ఓపికతో వేచి చూసే సమయం అయిపోయిందనీ, సుప్రీంకోర్టు ఈ కేసును త్వరగా తేల్చకపోతే ప్రభుత్వమే చట్టం తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగ్‌పూర్‌లో అన్నారు. వీహెచ్‌పీ నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఉద్యమాలు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఉండాలని పేర్కొన్నారు.
ఇప్పుడు కట్టకుంటే అంతే...
అయోధ్యలో రామాలయాన్ని నిర్మించకుంటే ప్రస్తుతం ఉన్నదే బీజేపీకి చివరి ప్రభుత్వం అవుతుందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడంటే అది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆయన మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకోలేకపోయారనీ, కానీ ప్రస్తుతం బీజేపీకి సొంతంగానే మెజారిటీ మార్కు కన్నా ఎక్కువ మంది ఎంపీలున్నా నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ రాముడి జపం చేస్తోందని అన్నారు.
కార్యక్రమానికి హాజరైన వీహెచ్‌పీ కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment