Champat Rai
-
రామాలయం అక్షతల పంపిణీ ప్రారంభం
అయోధ్య: అయోధ్యలోని భవ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు జరిగే విగ్రహ ప్రతిష్టకు గాను నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి అక్షతల పంపిణీని ప్రారంభించినట్లు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. బియ్యంతో పసుపు, నెయ్యి కలగలిపిన పవిత్ర అక్షతల పంపిణీ కార్యక్రమం మకర సంక్రాంతి వరకు, ఈ నెల 15 వరకు కొనసాగుతుందన్నారు. ప్రజలకు పంపిణీ చేసే అక్షతల ప్యాకెట్‌పై రామాలయం చిత్రంతోపాటు ఆలయ నిర్మాణం గురించిన వివరాలతో కూడిన కరపత్రం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల ఆలయాల పరిధిలోని 5 కోట్ల కుటుంబాల ప్రజలకు అక్షతలు అందుతాయని చెప్పారు. -
Ram Mandir Trust: అయోధ్యకు రాకండి!
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని ఆలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఆ రోజు అయోధ్యలో ఊహించనంతటి రద్దీ ఉంటుంది. కనుక ఎలాగైనా కార్యక్రమాన్ని కళ్లారా చూడాలని అయోధ్య దాకా రాకండి. మీరున్న చోటే ఆలయాల్లో పూజలు చేయండి’’ అని భవ్య రామమందిరం ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. జనవరి 16వ తేదీ నుంచే వైదిక కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పారు. 80 వేల మంది భక్తులకు బస, భోజన వసతి కలి్పంచేలా అయోధ్యలో ’టెంట్ సిటీ’ని నిర్మిస్తున్నారు. ఆలయ పూజారుల్లో తిరుపతి పూర్వ విద్యార్థి అయోధ్య రామాలయ పూజారిగా ఎంపికైన మోహిత్ పాండే తిరుపతిలో గతంలో వేద విద్య అభ్యసించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయంలో ఎంఏ (ఆచార్య) పట్టా సాధించారు. లక్నోలోని సీతాపూర్‌కు చెందిన మోహిత్ గాజియాబాద్‌లోని దుధేశ్వర్ వేద్ విద్యాపీఠ్‌లో ఏడేళ్ల సామవేదం అభ్యసించారు. తర్వాత వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేద విద్యాభ్యాసం కొనసాగించారు. -
అయోధ్యలో ప్రతిష్టాపనకు ప్రధానికి ఆహ్వానం
అయోధ్య: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. జనవరిలో జరుగనున్న ఆలయ ప్రారంబోత్సవానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. గర్భాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకలో పాల్గొనాలని కోరుతూ ప్రధాని మోదీకి అధికారికంగా ఆహా్వనం పంపించినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి 24వ తేదీల మధ్య సమయం ఇవ్వాలని కోరామని, ఈ మేరకు ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ సంతకంతో లేఖ రాశామని తెలిపారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశ విదేశీ ప్రముఖులతోపాటు లక్షలాది మంది సామాన్య భక్తులు తరలివస్తారని, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ట్రస్టు భావిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టులో స్వయంగా భూమిపూజ చేశారు. -
రామాలయం 40 శాతం పూర్తి
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు 40 శాతం దాకా పూర్తయ్యాయి. వాటికి రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తెలిసిందే. 2023 డిసెంబర్‌కల్లా పనులన్నీ పూర్తయి భక్తుల దర్శనానికి మందిరం సిద్ధమవుతుందని రామజన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ ఆదివారం తెలిపారు. మందిరం కనీసం వెయ్యేళ్లదాకా చెక్కుచెదరకుండా ఉండేలా పునాదులను సువిశాలంగా, భారీగా నిర్మిస్తున్నారు. మందిర నిర్మాణానికి దాదాపు 9 లక్షల క్యూబిక్ అడుగుల మక్రానా మార్బుల్ రాళ్లు వాడుతున్నారు. ప్రధానాలయ నిర్మాణంలో గులాబీ, గర్భాలయానికి, ఫ్లోరింగ్‌కు తెల్ల రాయి వాడుతున్నారు. మందిరానికి దారితీసే మార్గాల్లో రోడ్డు విస్తరణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. -
రామ మందిరం ట్రస్టు అధ్యక్షుడిగా నృత్యగోపాల్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్టుకి అధ్యక్షుడిగా మహంత్ నృత్యగోపాల్ దాస్ ఎన్నికయ్యారు. చంపాత్ రాయ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మందిర నిర్మాణం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీ రామ మందిర ట్రస్టు బుధవారం లాయర్ కె.పరాశరన్ నివాసంలో సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రాను మందిర నిర్మాణ కమిటీ చీఫ్‌గా ఎన్నుకున్నారు. అనంతరం చంపాత్ రాయ్ మాట్లాడుతూ.. మందిర నిర్మాణానికి భక్తులు ఇచ్చే విరాళాల కోసం అయోధ్య ఎస్బీఐలో ఖాతా తెరుస్తామన్నారు. పుణెకి చెందిన స్వామి గోవింద్ దేవ్ గిరిని కోశాధికారిగా నియమించినట్టు వెల్లడించారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా హోంశాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, యూపీ ప్రభుత్వ ప్రతినిధిగా అవినాశ్ అవస్తి, అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ జస్టిస్ అనూజ్‌కుమార్ ఝా హాజరయ్యారు. -
కుంభమేళాలో మందిర నిర్మాణ తేదీలు
అయోధ్య: రామ మందిర నిర్మాణం డిమాండ్‌తో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం నిర్వహించిన ధర్మసభకు లక్షలాది మంది రామభక్తులు హాజరయ్యారు. పండితుల మంత్రోచ్ఛరణలతో ధర్మసభ ప్రారంభమైంది. అనంతరం నిర్మోహి అఖాడాకు చెందిన రాంజీ దాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో జరిగే కుంభమేళాలోనే రామాలయ నిర్మాణ తేదీలపై ప్రకటన ఉంటుందని అన్నారు. ‘ఇంకొన్ని రోజులే. అందరూ ఓపికతో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. వీహెచ్‌పీ సీనియర్ నేత చంపత్ రాయ్ ప్రసంగిస్తూ వివాదంలో చిక్కుకున్న భూమిని హిందు, ముస్లిం సంస్థల మధ్య భాగాలుగా పంచేందుకు తాము ఒప్పుకోమనీ, మొత్తం స్థలం తమకే కావాలనీ, ఇక్కడి మొత్తం భూభాగంలో ఆలయం కడతామని అన్నారు. వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా పంచుతూ గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ మాట్లాడుతూ ‘ఇక్కడకు వచ్చిన ఇంత మంది జనాలను చూస్తుంటే వివిధ వర్గాల ప్రజలకు రామాలయంతో ఎంత అనుబంధం ఉందో తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ‘మేం కోర్టులను గౌరవిస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై మాకు ఎన్నో ఆశలున్నాయి. రామాలయ నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయాల్సిందిగా ఆదిత్యనాథ్‌ను నేను కోరుతున్నా’ అని గోపాల్‌దాస్ తెలిపారు. రామ్ భద్రాచార్య అనే ఓ నాయకుడు మాట్లాడుతూ గత శుక్రవారమే తాను ఓ కేంద్ర మంత్రిని కలిసి ఆయోధ్యపై మాట్లాడాననీ, డిసెంబర్ 11న ఎన్నికల నింబధనావళి కాలం ముగియగానే కేంద్ర మంత్రివర్గం సమావేశమై రామ మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ మంత్రి తనకు చెప్పారని తెలిపారు. పండుగ వాతావరణం ధర్మసభ వేదిక అంతా కాషాయ జెండాలు, రంగుల కాగితాలు, ప్లకార్డులతో నిండిపోయింది. అయోధ్యలో పండుగ వాతావరణం కనిపించింది. ధర్మసభకు అన్ని వర్గాల నుంచి మూడు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని వీహెచ్‌పీ తెలిపింది. ఐదు గంటలపాటు జరిగిన ఈ సభకు వివిధ ఆశ్రమాలు, అఖాడాలకు చెందిన దాదాపు 50 మంది స్వామీజీలు హాజరయ్యారు. హరిద్వార్, ఛత్తీస్‌గఢ్, రిషికేశ్, ఉజ్జయిని, గుజరాత్, చిత్రకూట్, ప్రయాగ్‌రాజ్, లక్నో తదితర ప్రదేశాల నుంచి సన్యాసులు ధర్మసభకు వచ్చారని అయోధ్యలోని నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రామ్‌దాస్ తెలిపారు. అయోధ్య జిల్లా పంచాయతీ సభ్యుడు బబ్లూ ఖాన్ నేతృత్వంలో కొందరు ముస్లింలు కూడా ధర్మసభలో పాల్గొన్నారు. బబ్లూఖాన్ మాట్లాడుతూ ‘రామ మందిరం ఉద్యమంలో నేను గత మూడేళ్లుగా పాల్గొంటు న్నా. అయోధ్యలోని ముస్లింలు కూడా ఇక్కడ రామాలయం కట్టాలని కోరుకుంటున్నారని నేను భావిస్తున్నా. నేనూ ముస్లింనే. ఇక్కడ రామ భక్తులకు స్వాగతం పలుకుతున్నా’ అని చెప్పారు. చట్టం తేవాలి: భాగవత్ మందిర నిర్మాణం కోసం ఓపికతో వేచి చూసే సమయం అయిపోయిందనీ, సుప్రీంకోర్టు ఈ కేసును త్వరగా తేల్చకపోతే ప్రభుత్వమే చట్టం తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగ్‌పూర్‌లో అన్నారు. వీహెచ్‌పీ నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఉద్యమాలు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు కట్టకుంటే అంతే... అయోధ్యలో రామాలయాన్ని నిర్మించకుంటే ప్రస్తుతం ఉన్నదే బీజేపీకి చివరి ప్రభుత్వం అవుతుందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడంటే అది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆయన మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకోలేకపోయారనీ, కానీ ప్రస్తుతం బీజేపీకి సొంతంగానే మెజారిటీ మార్కు కన్నా ఎక్కువ మంది ఎంపీలున్నా నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ రాముడి జపం చేస్తోందని అన్నారు. కార్యక్రమానికి హాజరైన వీహెచ్‌పీ కార్యకర్తలు -
మెరుగు పడిన అశోక్ సింఘాల్ ఆరోగ్యం
న్యూఢిల్లీ : విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. గుర్గావ్ లోని మెదాంత మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్ సింఘాల్‌ను ఈ రోజు ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సింఘాల్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడాలిని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గత రాత్రి అశోక్ సింఘాల్ శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన్ని మెదాంత ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. గతనెల్లో నవరాత్రి పూజ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నగరంలో హువాన్ పూజ జరుపుతున్న సయమంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఏయిర్ అంబులెన్‌లో గుర్గావ్లోని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.