Uddhav Turkre
-
100 కోట్ల ఆరోపణలపై దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సోమవారం లోక్‌సభ దద్దరిల్లింది. హోంమంత్రిపై ముంబై పోలీస్ కమిషనర్‌గా పని చేసిన వ్యక్తి అవినీతి ఆరోపణలు చేయడం చాలా తీవ్రమైన విషయమని, వెంటనే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగాలని బీజేపీ డిమాండ్ చేసింది. ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్‌లు తదితరాల నుంచి ప్రతీ నెల రూ.100 కోట్లు వసూలు చేయాలని ముంబై పోలీసు అధికారులకు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్వయంగా ఆదేశాలిచ్చారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను జీరో అవర్‌లో, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య బీజేపీ సభ్యుడు మనోజ్ కోటక్ లేవనెత్తారు. ఈ విషయంలో ఇంతవరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఎలాంటి స్పందన రాలేదని, తక్షణమే ఆయన ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ‘ఇది చాలా సీరియస్ అంశం. హోం మంత్రే కాదు. మొత్తం ప్రభుత్వం రాజీనామా చేయాలి. సీబీఐతో సమగ్రంగా విచారణ జరపాలి’ అన్నారు. దీన్ని రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశంగా చూడకూడదని బీజేపీ సభ్యుడు రాకేశ్ సింగ్ పేర్కొన్నారు. ముంబై నుంచే రూ. 100 కోట్లు అయితే, మొత్తం రాష్ట్రం నుంచి ఎంత వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. అనిల్ దేశ్‌ముఖ్ అవినీతిపై ఆరోపణలు రావడం ఇదే ప్రథమం కాదని, గతంలో డీజీపీ స్థాయి అధికారి ఆయనపై ఆరోపణలు చేశారని బీజేపీ సభ్యుడు కపిల్ పాటిల్ పేర్కొన్నారు. శరద్ పవార్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ.. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొన్న మహారాష్ట్ర సీనియర్ నేత.. ఆ వెంటనే మాట మార్చారన్నారు. ‘వాస్తవాలు బయటపడ్తాయని భయపడ్డారా?’ అని ప్రశ్నించారు. శివసేన ఎంపీ వినాయక రౌత్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అస్థిర పర్చేందుకు కేంద్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత రవ్నీత్ సింగ్ బిట్టు ఆరోపించారు. సచిన్ వాజే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో సీఎం ఫడ్నవీస్‌ను ఉద్ధవ్ ఠాక్రే కోరారని స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా తెలిపారు. అయితే, సీఎం ఆ అభ్యర్థనను తోసిపుచ్చారన్నారు. జీరో అవర్‌ను అధికార పక్షం రిగ్గింగ్ చేస్తోందని ఎన్సీపీ సభ్యురాలు సుప్రియ సూలే విమర్శించారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలి సుప్రీంలో పరమ్‌వీర్ పిటిషన్ మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే, తనను ముంబై పోలీస్ కమిషనర్ పోస్ట్ నుంచి బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. ‘అనిల్ దేశ్‌ముఖ్ 2021 ఫిబ్రవరి లో సచిన్ వాజే(ముంబై క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్), సంజయ్ పాటిల్(ఏసీపీ, ముంబై సోషల్ సర్వీస్ బ్రాంచ్)లను పిలిపించుకుని ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్‌లు, ఇతర మార్గాల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని ఆదేశించారు’ అని పిటిషన్లో పరమ్‌వీర్ సింగ్ పేర్కొన్నారు. -
కుంభమేళాలో మందిర నిర్మాణ తేదీలు
అయోధ్య: రామ మందిర నిర్మాణం డిమాండ్‌తో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం నిర్వహించిన ధర్మసభకు లక్షలాది మంది రామభక్తులు హాజరయ్యారు. పండితుల మంత్రోచ్ఛరణలతో ధర్మసభ ప్రారంభమైంది. అనంతరం నిర్మోహి అఖాడాకు చెందిన రాంజీ దాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో జరిగే కుంభమేళాలోనే రామాలయ నిర్మాణ తేదీలపై ప్రకటన ఉంటుందని అన్నారు. ‘ఇంకొన్ని రోజులే. అందరూ ఓపికతో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. వీహెచ్‌పీ సీనియర్ నేత చంపత్ రాయ్ ప్రసంగిస్తూ వివాదంలో చిక్కుకున్న భూమిని హిందు, ముస్లిం సంస్థల మధ్య భాగాలుగా పంచేందుకు తాము ఒప్పుకోమనీ, మొత్తం స్థలం తమకే కావాలనీ, ఇక్కడి మొత్తం భూభాగంలో ఆలయం కడతామని అన్నారు. వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా పంచుతూ గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ మాట్లాడుతూ ‘ఇక్కడకు వచ్చిన ఇంత మంది జనాలను చూస్తుంటే వివిధ వర్గాల ప్రజలకు రామాలయంతో ఎంత అనుబంధం ఉందో తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ‘మేం కోర్టులను గౌరవిస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై మాకు ఎన్నో ఆశలున్నాయి. రామాలయ నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయాల్సిందిగా ఆదిత్యనాథ్‌ను నేను కోరుతున్నా’ అని గోపాల్‌దాస్ తెలిపారు. రామ్ భద్రాచార్య అనే ఓ నాయకుడు మాట్లాడుతూ గత శుక్రవారమే తాను ఓ కేంద్ర మంత్రిని కలిసి ఆయోధ్యపై మాట్లాడాననీ, డిసెంబర్ 11న ఎన్నికల నింబధనావళి కాలం ముగియగానే కేంద్ర మంత్రివర్గం సమావేశమై రామ మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ మంత్రి తనకు చెప్పారని తెలిపారు. పండుగ వాతావరణం ధర్మసభ వేదిక అంతా కాషాయ జెండాలు, రంగుల కాగితాలు, ప్లకార్డులతో నిండిపోయింది. అయోధ్యలో పండుగ వాతావరణం కనిపించింది. ధర్మసభకు అన్ని వర్గాల నుంచి మూడు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని వీహెచ్‌పీ తెలిపింది. ఐదు గంటలపాటు జరిగిన ఈ సభకు వివిధ ఆశ్రమాలు, అఖాడాలకు చెందిన దాదాపు 50 మంది స్వామీజీలు హాజరయ్యారు. హరిద్వార్, ఛత్తీస్‌గఢ్, రిషికేశ్, ఉజ్జయిని, గుజరాత్, చిత్రకూట్, ప్రయాగ్‌రాజ్, లక్నో తదితర ప్రదేశాల నుంచి సన్యాసులు ధర్మసభకు వచ్చారని అయోధ్యలోని నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రామ్‌దాస్ తెలిపారు. అయోధ్య జిల్లా పంచాయతీ సభ్యుడు బబ్లూ ఖాన్ నేతృత్వంలో కొందరు ముస్లింలు కూడా ధర్మసభలో పాల్గొన్నారు. బబ్లూఖాన్ మాట్లాడుతూ ‘రామ మందిరం ఉద్యమంలో నేను గత మూడేళ్లుగా పాల్గొంటు న్నా. అయోధ్యలోని ముస్లింలు కూడా ఇక్కడ రామాలయం కట్టాలని కోరుకుంటున్నారని నేను భావిస్తున్నా. నేనూ ముస్లింనే. ఇక్కడ రామ భక్తులకు స్వాగతం పలుకుతున్నా’ అని చెప్పారు. చట్టం తేవాలి: భాగవత్ మందిర నిర్మాణం కోసం ఓపికతో వేచి చూసే సమయం అయిపోయిందనీ, సుప్రీంకోర్టు ఈ కేసును త్వరగా తేల్చకపోతే ప్రభుత్వమే చట్టం తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగ్‌పూర్‌లో అన్నారు. వీహెచ్‌పీ నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఉద్యమాలు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు కట్టకుంటే అంతే... అయోధ్యలో రామాలయాన్ని నిర్మించకుంటే ప్రస్తుతం ఉన్నదే బీజేపీకి చివరి ప్రభుత్వం అవుతుందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడంటే అది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆయన మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకోలేకపోయారనీ, కానీ ప్రస్తుతం బీజేపీకి సొంతంగానే మెజారిటీ మార్కు కన్నా ఎక్కువ మంది ఎంపీలున్నా నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ రాముడి జపం చేస్తోందని అన్నారు. కార్యక్రమానికి హాజరైన వీహెచ్‌పీ కార్యకర్తలు -
లక్షమందితో రేపే ధర్మసభ
ముంబై/లక్నో/అయోధ్య: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం హిందూ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆలయ నిర్మాణం ప్రారంభంపై చర్చించేందుకు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆదివారం అయోధ్యలో భారీ ధర్మసభను నిర్వహించనుంది. 1992 డిసెంబర్ 6వ తేదీన వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేసిన సమయంలో హాజరైనంతమంది కరసేవకులు ధర్మసభకు వచ్చే వీలుంది. నేడు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే తమ కార్యకర్తలతో కలిసి అయోధ్యకు రానున్నారు. నేతలకు చోటులేదు ధర్మసభకు దాదాపు లక్షమంది కరసేవకులు హాజరవుతారని వీహెచ్‌పీ తెలిపింది. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే, రాజకీయ సభ కాదని వీహెచ్‌పీ తెలిపింది. ‘ఇక్కడే రామమందిర నిర్మాణ తేదీని ఖరారు చేస్తాం. ధర్మసభతో ఆలయ నిర్మాణంలో ఆఖరి అడ్డంకి తొలగిపోతుంది. దీని తర్వాత ఎటువంటి సభలు, ర్యాలీలు, నిరసనలు, చర్చలు ఉండబోవు’ అని స్పష్టం చేసింది. వేదికపై రాజకీయ నేతలకు చోటులేదని వీహెచ్‌పీ తెలిపింది. ‘ధర్మసభ ప్రధాన వేదికపై కేవలం సాధువులు మాత్రమే కూర్చుంటారు. రాజకీయ నేతలెవ్వరికీ ప్రవేశం లేదని తెలిపింది. ‘ధర్మసభ, ర్యాలీకి లక్షమందికిపైగా వస్తారని భావిస్తున్నాం. ఆర్డినెన్స్ లేదా పార్లమెంట్లో బిల్లు తేవడం ద్వారా మందిర నిర్మాణం చేపట్టేందుకు ఈ కార్యక్రమం ద్వారా కేంద్రానికి గట్టి సంకేతం పంపుతాం’ అని వీహెచ్‌పీ ప్రాంతీయ నిర్వాహక కార్యదర్శి చెప్పారు. 25న నాగ్‌పూర్, బెంగళూరుల్లో, డిసెంబర్ 9న ఢిల్లీలో ఇలాంటి ర్యాలీలు చేపట్టనున్నారు. 17 నిమిషాల్లో కూల్చేశాం.. 1992లో రామ భక్తులు అయోధ్యలో బాబ్రీ మసీదును 17 నిమిషాల్లోనే కూల్చివేశారు. గుడి కోసం ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రభుత్వం ఇంకా ఎంత సమయం తీసుకుంటుందని శివసేన నిలదీసింది. ‘ ఆ మసీదును 17 నిమిషాల్లో కూల్చేశారు. అప్పటి నుంచి ఆ ఖాళీ అలాగే ఉంది. ఆర్డినెన్స్ పత్రాలు తయారు చేసేందుకు, రాష్ట్రపతి భవన్ నుంచి యూపీ అసెంబ్లీకి అవి చేరేందుకు ఎంత సమయం పడుతుంది. అక్కడా ఇక్కడా ఉన్నవి బీజేపీ ప్రభుత్వాలే కదా? అని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. మందిరం కోసం ఆర్డినెన్స్ తేవాలనీ, నిర్మాణ తేదీని ఖరారు చేయాలని శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో డిమాండ్ చేసింది. ‘అయోధ్యలో ప్రస్తుతం రామరాజ్యం లేదు. ఉన్నది సుప్రీంకోర్టు రాజ్యం. మా యాత్రపై పెడార్థాలు తీయడం మానేసి, గుడి కట్టే తేదీ తేల్చండి’ అని కేంద్రాన్ని కోరింది. -
ఆ ప్రాంతాలనూ పట్టించుకోవాలి..
సాక్షి, ముంబై: ముంబై విషయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆలోచనలు తగిన విధంగా లేవని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’ మంగళవారం నాటి సంపాదకీయంలో ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేశారు. ముంబై అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సంఘాన్ని ఏర్పాటుచేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్ధవ్ ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ముంబై నగరం మరింత అభివృద్ధి చెందాల్సిన విషయం వాస్తవమే కాని రోగం కంటే మందులే భయంకరంగా మారకూడదని వ్యాఖ్యానించారు. ముంబై ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచింది...దేశ ఆర్థిక రాజధానిగా మారింది. అయితే ముంబైతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కరువుతో అల్లాడుతున్న విదర్భ,మరాఠ్వాడా గురించి సీఎం ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత బాగుంటుంద’ని పేర్కొన్నారు. అలా చేయకపోతే రాష్ట్ర అభివృద్ధిపై దీని ప్రభావం తప్పకుండా పడుతుందని ఆయన పరోక్షంగా సీఎంను హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ముంబైను మహారాష్ట్ర నుంచి విడదీసేందుకు తాము ఎన్నటికీ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ముంబై కోసం స్వతంత్ర హోదా కలిగిన మంత్రిని నియమించాలని ప్రభుత్వం చేసిన యత్నాన్ని శివసేన అడ్డుకుందని గుర్తుచేశారు. అలాగే ముంబైకు సీఈవో ఏర్పాటు ఆలోచనతో కూడా తాము విభేదించామన్నారు. అయితే బీజేపీ సర్కారు ఆలోచనలు రాష్ట్రానికి ఎంతవరకు మేలు చేస్తాయి.. రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి అనే విషయాలను ఆలోచించే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడారని భావిస్తున్నామని ఆయన ముక్తాయించారు. శివసేనకు అంగీకారమే.... -ముఖ్యమంత్రి. తాము తీసుకుంటున్న నిర్ణయాలు, అవలంభిస్తున్న విధానాలు శివసేనకు అంగీకారమేనని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. శీతాకాల సమావేశాల సందర్భంగా నాగపూర్‌లో ఉన్న సీఎంను ‘సామ్నా’ సంపాదకీయంపై విలేకరులు ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. ముంబైకి సంబంధించిన అనేక అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ఆమోదం కోసం కేంద్రం వద్ద నిలిచిపోయాయన్నారు. దీంతో కేంద్రం నుంచి తొందరగా అనుమతులు లభించేందుకు ఇలాంటి సంఘం అవసరమని తాము భావిస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ విధానంపై శివసేనకు ఎలాంటి అభ్యంతరం ఉండదనే తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.