సాక్షి, ముంబై: ముంబై విషయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆలోచనలు తగిన విధంగా లేవని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’ మంగళవారం నాటి సంపాదకీయంలో ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేశారు. ముంబై అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సంఘాన్ని ఏర్పాటుచేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్ధవ్ ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ముంబై నగరం మరింత అభివృద్ధి చెందాల్సిన విషయం వాస్తవమే కాని రోగం కంటే మందులే భయంకరంగా మారకూడదని వ్యాఖ్యానించారు. ముంబై ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచింది...దేశ ఆర్థిక రాజధానిగా మారింది.
అయితే ముంబైతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కరువుతో అల్లాడుతున్న విదర్భ,మరాఠ్వాడా గురించి సీఎం ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత బాగుంటుంద’ని పేర్కొన్నారు. అలా చేయకపోతే రాష్ట్ర అభివృద్ధిపై దీని ప్రభావం తప్పకుండా పడుతుందని ఆయన పరోక్షంగా సీఎంను హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ముంబైను మహారాష్ట్ర నుంచి విడదీసేందుకు తాము ఎన్నటికీ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ముంబై కోసం స్వతంత్ర హోదా కలిగిన మంత్రిని నియమించాలని ప్రభుత్వం చేసిన యత్నాన్ని శివసేన అడ్డుకుందని గుర్తుచేశారు. అలాగే ముంబైకు సీఈవో ఏర్పాటు ఆలోచనతో కూడా తాము విభేదించామన్నారు.
అయితే బీజేపీ సర్కారు ఆలోచనలు రాష్ట్రానికి ఎంతవరకు మేలు చేస్తాయి.. రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి అనే విషయాలను ఆలోచించే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడారని భావిస్తున్నామని ఆయన ముక్తాయించారు.
శివసేనకు అంగీకారమే.... -ముఖ్యమంత్రి.
తాము తీసుకుంటున్న నిర్ణయాలు, అవలంభిస్తున్న విధానాలు శివసేనకు అంగీకారమేనని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. శీతాకాల సమావేశాల సందర్భంగా నాగపూర్‌లో ఉన్న సీఎంను ‘సామ్నా’ సంపాదకీయంపై విలేకరులు ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. ముంబైకి సంబంధించిన అనేక అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ఆమోదం కోసం కేంద్రం వద్ద నిలిచిపోయాయన్నారు. దీంతో కేంద్రం నుంచి తొందరగా అనుమతులు లభించేందుకు ఇలాంటి సంఘం అవసరమని తాము భావిస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ విధానంపై శివసేనకు ఎలాంటి అభ్యంతరం ఉండదనే తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆ ప్రాంతాలనూ పట్టించుకోవాలి..
Published Tue, Dec 9 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM
Advertisement
Advertisement