మాల్యా దోషే: సుప్రీంకోర్టు
► రూ. 260 కోట్లను తన పిల్లలకు బదిలీ చేయడం కోర్టు ధిక్కరణే
► జూలై 10లోపు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశం
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ.. దాదాపు 40 మిలియన్ డాలర్లను(రూ. 260 కోట్లు) తన పిల్లలకు బదిలీ చేసినందుకు కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాల్యాను శిక్షపై తన వాదనలు వినిపించేందుకు జూలై 10 లోపు తన ముందు హాజరుకావాలని మంగళవారం కోర్టు ఆదేశించింది.
‘రెండు ఆధారాల్ని పరిగణనలోకి తీసుకుని కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాను దోషిగా తేల్చా’మని జస్టిస్ ఏకే గోయల్, యుయు లలిత్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న మాల్యాను అప్పగించాలంటూ ఇటీవలే బ్రిటన్‌ను భారత్ అధికారికంగా కోరిన సంగతి తెలిసిందే.
కర్ణాటక హైకోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తూ డబ్బును కొడుకు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియన్ మాల్యా, టాన్యా మాల్యాలకు విజయ్ మాల్యా బదిలీ చేసినట్లు బ్యాంకులు ఆరోపించాయి. డియాజియో నుంచి అందుకున్న డబ్బు వివరాలు ఎందుకు తెలపలేదని... ఆ మొత్తం పిల్లలకు బదిలీ చేసినట్లు ఎందుకు వెల్లడించలేదని కోర్టు మాల్యాను ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ నోటీసుకు సమాధానం ఇవ్వాలని మాల్యా తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌ను ఆదేశించింది.