దిగివస్తున్న మాల్యా?
బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యవహరంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇటు సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో విదేశాల్లో చక్కర్లు కొడుతున్న మాల్యా బెంబేలెత్తినట్టు కనిపిస్తోంది. ఈడీ, కోర్టుముందు హాజరుకాకుండా, బేరసారాలకు దిగుతున్న విజయ్‌మాల్యా మరింత దిగివచ్చినట్టు తెలుస్తోంది. తమ హెచ్చరికలను ఖాతరుచేయని మాల్యా వ్యవహారంపై ఈడీ సీరియస్ గా స్పందించడంతో రుణాల సెటిల్ మెంట్ కు సంబంధించి మరో కొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చారు. బుదవారం నాటి ఈడీ షాక్‌తో మొదటికే మోసం వస్తుందని భావించిన మాల్యా.. మొత్తం సెటిల్‌మెంట్‌ను రూ.6 వేల కోట్లకు పెంచుతూ ప్రతిపాదించారు. గతంలో 4వేల కోట్లు మాత్రమే చెల్లిస్తానని చెప్పిన మాల్యా, ఇప్పుడు మరో 2వేల కోట్లను జోడించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనను ఆయన త్వరలోనే కోర్టుకు ముందుకు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పాస్ పోర్టు రద్దుచేయాలని ఈడీ ప్రభుత్వానికి లేఖ రాయడం వల్లే ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. ముందుగా మీ ఆస్తుల విలువ ఎంతో చెప్పండన్న సుప్పీంకోర్టు మొట్టికాయలు కూడా గట్టి ప్రభావాన్నే చూపించాయి. కాగా, ఐడీబీఐ కేసులో తన ముందు విచారణకు హాజరుకాని మాల్యా పాస్ పోర్టు రద్దు చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రభుత్వానికి బుధవారం లేఖ రాసింది. మరోవైపు బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.4,900 కోట్లు, దానికి అయిన వడ్డీ... మొత్తం కలుపుకుని రుణం రూ.9 వేల కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే.