కేరళ సీఎంగా విజయన్ ప్రమాణం
ఇద్దరు మహిళలు సహా 19 మందితో మంత్రివర్గం
తిరువనంతపురం: సీపీఎం ఉక్కుమనిషి, 72 ఏళ్ల పినరయి విజయన్ కేరళ 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారమిక్కడి సెంట్రల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్)కు చెందిన 19 మంది సభ్యులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, 13 మంది కొత్త వారున్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సదాశివం వీరితోప్రమాణం చేయించారు. విజయన్ ప్రమాణం మలయాళంలో సాగిం ది. 19 మంది కేబినెట్ మంత్రుల్లో సీఎం సహా 12 మంది సీపీఎం, నలుగురు సీపీఐకి చెందినవారు. ఎన్‌సీపీ, జనతాదళ్(ఎస్), కాంగ్రెస్(ఎస్)నుంచి ఒకరు చొప్పున ఉన్నారు.
అతిరథ మహారథులు: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం ఊమెన్ చాందీ, వీఎస్ అచ్యుతానందన్, సీసీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మరో నేత ప్రకాశ్ కారత్, 1957 నాటి నంబూద్రిపాద్ కేబినెట్‌లో మంత్రిగా చేసిన 97 ఏళ్ల కేఆర్ గౌరీ అమ్మ, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే ఒ.రాజగోపాల్, సినీ ప్రముఖులు, మత, సాంస్కృతిక సారథులు ప్రమాణ స్వీకారోత్సవానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ నెల 16న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ 140 స్థానాలకు గాను 91 స్థానాలు గెలిచింది.రాజధాని నగరం కమ్యూనిస్టు జెండాలతో ఎర్ర సముద్రాన్ని తలపించింది.
అచ్యుతానందన్ సలాం...
ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన విజయన్‌కు సీపీఎం సీనియర్ నాయకుడు, 92 ఏళ్ల వీఎస్ అచ్యుతానందన్.. సలాం చేశారు. విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తుందని ఆశిస్తూ కొత్తగా ఏర్పడిన మంత్రి వర్గానికి అభినందనలు తెలిపారు. కేరళలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను అచ్యుతానందన్ ఖండించారు. ప్రగతిశీల ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వారు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గీత కార్మిక కుటుంబం నుంచి...
పినరయి విజయన్ పేద గీత కార్మిక కుటుంబం నుంచి వచ్చి సీఎం స్థాయికి ఎదిగారు. అనుక్షణం ప్రజా పోరాటాల్లో మమేకమయ్యారు. సొంత పార్టీ అయిన సీపీఎం సీనియర్ నేత, మాజీ సీఎం అచ్యుతానందన్‌ను రేసు నుంచి వెనక్కి నెట్టి సీఎం పీఠం దక్కించుకున్న విజయన్ మార్చి 21 1944లో కన్నూర్ జిల్లా పినరయిలో జన్మించారు. తలస్సెరిలో ఆయన బీఏ ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు ‘కేరళ విద్యార్థి సమాఖ్య’ కన్నూర్ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. పాఠశాల విద్యత తర్వాత ఆయన కొంత కాలం చేనేత కార్మికుడిగా పనిచేశారు. 1970లో 26 ఏళ్లప్పుడు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1977,91, 96ల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమర్జెన్సీలో ఆరుగురు పోలీసులు ఆయన్ను లాకప్‌లో పెట్టి స్పృహతప్పేవరకు చితకబాదారు. విడుదలయ్యాక రక్తం మరకల చొక్కాతో అసెంబ్లీకి వెళ్లిన విజయన్ నాటి హోంమంత్రి, కాంగ్రెస్ నేత కె.కరుణాకరన్‌ను ఉద్దేశించి శక్తివంతమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇది అసెంబ్లీ చరిత్రలో అద్భుతమైన ఘట్టం. ఆయన రాజకీయ ప్రాబల్యం ఉన్న తియ్య వర్గానికి చెందినవారు. పార్టీ నేత అచ్యుతానందన్‌తో ఆయన శత్రుత్వం బహిరంగంగానే చర్చకొచ్చేది. ఓ సమయంలో గీత దాటినందుకు ఇద్దరూ పార్టీ పొలిట్‌బ్యూరో నుంచి(2007) సస్పెండ్ అయ్యారు.