
సాక్షి, న్యూఢిల్లీ : విభజన హామీల అమలుపై ఏపీ ఎంపీల నిరసనలతో గురువారం రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కేంద్ర మంత్రులకు సమిష్టి బాధ్యత ఉంటుందని, కేబినెట్‌లో బడ్జెట్‌కు ఆమోదం తెలిపి సభలో విభేదించడం రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కేబినెట్ నిర్ణయంతో విభేదించవచ్చని, మంత్రి పదవిలో కొనసాగుతూ కేబినెట్ నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పందిస్తూ కేంద్రమంత్రులు సలహాలు ఇవ్వచ్చని, సుజనా మాటలు కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకం కాదని చెప్పారు. దీనిపై సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతకుముందు విభజన హామీలపై పెద్దల సభలో వాడివేడి చర్చ జరిగింది. విభజన హామీలను అమలుచేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. విభజన చట్టాన్ని గౌరవించాలని, బిల్లులో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కోరారు. సభ్యుల ఆందోళనల నడుమ రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది.
ఛైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
రాజ్యసభ సభ వాయిదా అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై ఛైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఛైర్మనే నిబంధనలు అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఛైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఒక మంత్రి మరొక మంత్రికి సలహా ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యను ఛైర్మన్ ఎలా సమర్థిస్తారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.