
బెంగళూరు : చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా జాబిల్లికి దగ్గరగా వెళ్లి జాడలేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరింత పురోగతి సాధించింది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించామని ఇస్రో చైర్మన్ కె శివన్ ఆదివారం నాడు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విక్రమ్ ల్యాండర్ పరిస్థితి గురించి ఇస్రో నేడు కీలక ప్రకటన చేసింది. విక్రమ్ ల్యాండర్ సురక్షితంగానే ఉందని వెల్లడించింది. చంద్రుని ఉపరితలంపై ‘విక్రమ్’ హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ.. అది ముక్కలు కాలేదని ఇస్రో తెలిపింది. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు తీవ్రంగా యత్నిస్తున్నట్టు పేర్కొంది. ల్యాండర్ ముక్కలు కాకపోవడంతో.. చంద్రయాన్-2పై శాస్త్రవేత్తల ఆశలు సజీవంగానే ఉన్నాయి.
అయితే విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఏర్పడే వరకు దాని లోపలి పరిస్థితి ఏ విధంగా ఉందనేది చెప్పడం కష్టమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాగా, గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే.
చదవండి : ‘విక్రమ్’ను గుర్తించాం!
Comments
Please login to add a commentAdd a comment