పటేళ్ల ఆందోళనలో హింస
♦ మెహసన పట్టణంలో కర్ఫ్యూ
♦ పలువురి అరెస్టు
మెహసన: గుజరాత్‌లో రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న పటేల్ సామాజిక వర్గీయులు మళ్లీ ఆందోళనకు దిగారు. రిజర్వేషన్లతో పాటు తమ నేత హార్దిక్ పటేల్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. మెహసన పట్టణంలో ఆందోళన హింసాయుతంగా మారింది. ఆందోళనకారులు రెండు ప్రభుత్వ భవనాలకు నిప్పుపెట్టి, కొన్ని పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. రాళ్ల దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేసి, బాష్పవాయు గోళాలు విసిరారు.
ఈ ఘటనలో సర్దార్ పటేల్ గ్రూప్ (ఎస్‌పీజీ) చీఫ్ లాల్జీ పటేల్‌కు తలకు తీవ్ర గాయమైంది. దీంతో మెహసన పట్టణంలో సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించినట్లు మెహసన జిల్లా చెప్పారు. అప్పటివరకు మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపిపేస్తామన్నారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో రెవెన్యూ అధికారి గాయపడ్డారన్నారు. ఈ ఘటనకు సంబంధించి 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడిలో తమ మద్దతుదారులు 25 మంది గాయపడ్డారని నిరసనకారులు చెబుతున్నారు.
సూరత్‌లో 435 మంది అదుపులోకి...
సూరత్‌లో ఆందోళన చేస్తున్న 435 మంది పటేల్ వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఎస్‌పీజీతో పాటు హార్దిక్ నాయకత్వంలో కొనసాగుతున్న పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి.