కశ్మీర్‌లో ఆరని చిచ్చు
35కు పెరిగిన మృతుల సంఖ్య
శ్రీనగర్ : కశ్మీర్‌లోయలో వరుసగా బుధవారం ఐదోరోజూ ఉద్రిక్తత కొనసాగింది.సాయంత్రం వరకు కొంచెం ప్రశాంతంగా కనిపించగా, ఆ తర్వాత ఒక్కసారిగా మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. కోయ్‌మోలోని హర్నాగ్‌లో కొంతమంది యువకులు వాహనాల్లో వెళ్తున్న భద్రతాబలగాలపై రాళ్లు రువ్వారు. బలగాలు కాల్పులు జరపగా, ఒక యువకుడు మృతిచెందాడు. దీంతో ఐదురోజుల ఘర్షణల్లో మృతుల సంఖ్య 35కు పెరిగింది. యువకుడి మృతి వార్త దావానలంలా వ్యాపించడంతో ఆందోళనకారులు అనంతనాగ్ జిల్లాలోని ఖన్నబాల్‌లో అటవీ గృహానికి నిప్పుపెట్టారు. పుల్వామా జిల్లాలోపోలీసులపైకి రాళ్లు విసిరారు. పాంపోర్, కుప్వారా, అనంతనాగ్ పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని హతమార్చడంతో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే.
ఘర్షణలను నిరసిస్తూ వేర్పాటువాదులు బుధవారం కూడా బంద్ కొనసాగించడంతో జనజీవనం స్తంభించిపోయింది.గురు, శుక్రవారాల్లో కూడా బంద్ కొనసాగించాలని హురియత్, జేకేఎల్‌ఎఫ్ పిలుపునిచ్చాయి. గృహ నిర్బంధంలో ఉన్న హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ గిలానీ ఆంక్షలను ధిక్కరించి ర్యాలీలో పాల్గొనేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రక్తపాతం, హింస నుంచి జమ్మూ కశ్మీర్‌కు విముక్తి కల్పిద్దామని, దీనికి ప్రజా సహకారం కావాలని రాష్ర్ట సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు.