జాతి విద్రోహ చర్య: డజను మంది అధికారులపై వేటు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో కొనసాగుతున్న ఆందోళనలకు మరింత ఆజ్యం పోస్తూ జాతివిద్రోహ చర్యలకు పాల్పడుతున్న 12మంది అధికారులపై మెహబూబా ముఫ్తి ప్రభుత్వం వేటు వేసింది. కశ్మీర్‌లో అశాంతి రేపుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపిన ప్రభుత్వ సిబ్బందిని ఉద్యోగాల్లోంచి తొలగించింది.
విద్య, నీటిపారుదల, రెవెన్యూ, ఆహార, అటవీశాఖలకు చెందిన 12మంది అధికారులపై వేటు పడింది. కశ్మీర్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా లోయలో అశాంతిని ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీ ఎన్‌కౌంటర్ అనతరం కశ్మీర్ లోయలో తలెత్తిన హింసాత్మక ఆందోళనలు ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 100 రోజులైనా కశ్మీర్‌లో ఇంకా పూర్థిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. పాకిస్థాన్ ప్రభుత్వం, పాక్ ఉగ్రవాదులు అందించిన సహకారంతోనే కశ్మీర్‌లో అశాంతి, ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కశ్మీర్ అశాంతికి పరోక్ష సహకారం అందిస్తూ ఆందోళనలకు మద్దతుగా నిలిచిన ప్రభుత్వ అధికారులపై మెహబూబా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.