144 సెక్షన్
-
తెరుచుకోని దుకాణాలు
-
మూతబడిన విద్యాసంస్థలు
నాగిరెడ్డిపేట:
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా నాగిరెడ్డిపేట మండల విలీనంపై ఏర్పడిన చిచ్చుతో పోలీసులు మంగళవారం 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం నుంచే పోలీసులు రోడ్లపై వచ్చి గుంపులుగా ఉండకూడదని ప్రజలకు సూచించారు. మెదక్ జిల్లాకు మద్దతుగా ఏర్పాటు చేసిన రీలే నిరాహార దీక్షలకు సంబంధించిన టెంట్‌ను తీసేయించారు. అలాగే, ప్రజా ఐక్య వేదిక కార్యాలయం వద్ద ఉన్న వారందరినీ అక్కడి నుండి పంపించారు. మండల కేంద్రంలో ఎలాంటి బంద్‌లు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించారు. జిల్లాకేంద్రం నుండి వచ్చిన క్యూఆర్‌టీ (క్విక్ రియాక్షన్ టీం) పోలీసులతో ఎస్సై సీతారాములు మండల కేంద్రంలో పలుమార్లు కవాతు నిర్వహించారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలయ్యేలా ఎల్లారెడ్డి, లింగంపేట మండలాలకు చెందిన ఎస్సైలు పూర్ణేశ్వర్, రాజశేఖర్ వారి బలగాలతో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎక్కడా కూడా నలుగురు నిలబడవద్దని పోలీసులు ఇచ్చిన సూచనలతో వ్యాపారులు సైతం వారి దుకాణాలను మూసివేశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించి బందోబస్తు చేపట్టాయి. దీంతో మండల కేంద్రంలో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడ్డారు.