అంతటి కోపం కన్వారీలకు ఎందుకు? | Violence In Kanwar Yatra | Sakshi
Sakshi News home page

అంతటి కోపం కన్వారీలకు ఎందుకు?

Published Sat, Aug 11 2018 8:19 PM | Last Updated on Sun, Aug 12 2018 8:25 AM

Violence In Kanwar Yatra - Sakshi

ఢిల్లీలోని మోతీనగర్‌లో కారును ధ్వంసం చేసిన కన్వారీలు

సాక్షి, న్యూఢిల్లీ : స్వరం మారుతోంది. వారి తీరు మారుతోంది. ఒకప్పుడు సాధుశీలురైన కన్వారీలు (శివభక్తులు) ఆధ్యాత్మిక చింతనతో ముఖాలపై చిద్విలాసం చెదరకుండా, పరిసరాలను అంతగా పట్టించుకోకుండా తమ మానాన తాము వెళ్లేవారు. ఇప్పుడు వారిలో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఆధ్యాత్మిక చింతనేమోగానీ ముఖాన చిటపటలు కనిపిస్తున్నాయి. వారిలో అసహనం పెరిగిపోతోంది. తమ బాటకు అడ్డొచ్చిన వారిపై చేయి చేసుకుంటున్నారు, చితక బాదుతున్నారు. బుధవారం పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో కారు నడుపుతున్న ఓ మహిళను అడ్డగించి ఆమె భర్తపై చేయి చేసుకున్నారు. కారును ధ్వంసం చేశారు. ఓ సైక్లిస్టును చితక బాదారు. ఆ మరునాడు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌ షహర్‌లో ఓ అత్యవసర పోలీసు వాహనాన్నే ధ్వంసం చేశారు. పోలీసులను తరిమికొట్టారు. దీనికంతటికి కారణం తాము ఓ యాత్రగా వెళుతున్నప్పుడు తమను గౌరవించి సాదరంగా దారివ్వలేదనే కోపం, ఆక్రోశం కావచ్చు.

ఢిల్లీలో తాము రోడ్డు దాటుతుంటే కారును వేగంగా నడిపిందన్న కారణంగా, తమ యాత్రికుల మధ్యకు సైక్లిస్టు వచ్చారన్న కారణంగా, ఉత్తరప్రదేశ్‌లో తమను అతిక్రమించి ముందుకు దూసుకెళుతుందన్న కారణంగా కన్వారీలు ఈ దాడులకు దిగారు. కొన్ని చోట్ల వారు మామూలు కర్రలతో కనిపించగా, కొన్ని చోట్ల క్రికెట్‌ బ్యాట్లతోని, సుత్తెలతోని దౌర్జన్యానికి దిగుతూ వీడియోల్లో కనిపించారు. యూపీలో పోలీసు వ్యాన్‌పై దాడి చేయడానికి ముందు ఆ రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ ప్రత్యేక హెలికాప్టర్‌ మీది నుంచి కన్వారీలపై సాదర స్వాగతంలా పూరెమ్మలు కురిపించారు. అలా చేసినా, పోలీసుల వ్యాన్‌పైనే కన్వారీలు ఎందుకు దాడి చేశారని ప్రశ్నించగా, రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగితే సర్ది చెప్పడానికి వెళ్లినప్పుడు దాడి జరిగిందంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. నేడు హిందువులకు ప్రమాదం పొంచి ఉందంటూ అసందర్భంగా మాట్లాడారు. గత నాలుగు సంవత్సరాల నుంచే కన్వారీలు ఇలా దౌర్జన్యానికి దిగుతున్నారని మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. నిందితులపై కేసులు దాఖలైన దాఖలాలు లేవు. ఢిల్లీలో మాత్రం బుధవారం కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని విడుదల చేసినట్లు తెల్సింది.

ఇంతకు కన్వారీలు ఎవరు?
కావడి కుండలను మోయడం వల్ల వారికి ఆ పేరు వచ్చింది. శివభక్తులైన వీరు ప్రతి శ్రావణ మాసంలో (తెలుగు క్యాలెండర్‌ ప్రకారం ఐదవ నెల, ఇంగ్లీషు క్యాలెండర్‌ ప్రకారం జూలై–ఆగస్టు) ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రి పుణ్యక్షేత్రాలను, బీహార్‌లోని సుల్తాన్‌ గంజ్‌ని సందర్శించి అక్కడ గంగా జలాలను తీసుకొని తమ ఊర్లకు వచ్చి ఊరిలోని శివలింగానికి అభిషేకం చేస్తారు. గంగా జలాల కోసం వారు ఇంటి నుంచి ఇరువైపుల కుండలు కలిగిన కావడిని తీసుకొని చెప్పులు లేకుండా నగ్న పాదాలతో వెళతారు. 1980లో ఈ యాత్ర పూర్తిగా సాధువులు, సన్యాసులకే పరిమితం అయింది. వారు నిష్టంగా తమ ఊరి నుంచి గంగా జలం వరకు, అక్కడి నుంచి మళ్లీ ఊరి వరకు కాలి నడకన కావడి కుండలను మోసుకొచ్చేవారు.


ద్విచక్ర వాహనాలపై జాతీయ జెండాలతో కన్వారీలు

కాలక్రమంలో కాషాయ వస్త్రాలు ధరించిన యువకులు కూడా ఈ యాత్రలో పాల్గొనడం మొదలయింది. వారిలో కొందరు సాధారణ దుస్తులు వేసుకొని కూడా యాత్రలో పాల్గొంటున్నారు. మరి కొందరు వాహనాలపై కూడా వెళుతున్నారు, వస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో యాత్రలో యువకులు పాల్గొనడం ఎక్కువైంది. ఇప్పుడు ఇంకొందరు తమ వాహనాలకు జాతీయ జెండాలను కట్టుకొని ‘భారత మాతా జిందాబాద్‌’ అని నినాదాలిస్తూ వెళుతున్నారు. 1980లో ఏటా దాదాపు ఓ లక్ష మంది సాధువులు ఈ యాత్రలో పొల్గొంటే గతేడాది 14 లక్షల మంది యాత్రలో పాల్గొన్నారని అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు.

వారి కోపానికి కారణాలేమిటీ?
యాత్రలో యువకులు పాల్గొనడం, వారిలో సహజ సిద్ధంగానే కోపోద్రేకాలు ఎక్కువ ఉండడం ఓ కారణమైతే, పెళ్లాం, పిల్లలను వదిలేసి రావడం, మహిళా భక్తులకు ప్రమేయం లేని యాత్ర అవడం వల్ల కూడా వారిలో ఒకలాంటి విసుగు ఎక్కువ అవుతుందని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. తాము ఇంతటి భక్తులమైనప్పటికీ తమను గౌరవించి దారి ఇవ్వాల్సిన ప్రజలు పట్టించుకోవడం లేదన్న అహంభావం కూడా కారణమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. నిజమైన భక్తి లేకుండా భక్తిని ప్రదర్శించుకోవడానికి మాత్రమే కొంత మంది యువకులు యాత్రలో పాల్గొంటుండం వల్ల, ఆరెస్సెస్‌ శక్తులు ప్రవేశించడం వల్లనే దౌర్జన్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మార్క్సిస్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి మాత్రమే కన్వారీలు ఈ యాత్రలు నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement