స్వామీజీ అరెస్ట్‌పై టెన్షన్!
వివాదాస్పద స్వామి రాంపాల్ ఆశ్రమం వద్ద ఘర్షణలు
బర్వాలా(హర్యానా): హర్యానాలో వివాదాస్పద స్వామీజీ రాంపాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ హింసాత్మకంగా మారింది. బర్వాలా పట్టణంలోని స్వామీజీ ఆశ్రమం వద్ద ఆయన అనుచరులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో 200 మంది గాయపడ్డారు. వారిలో స్వామీజీ అనుచరులు, మీడియా ప్రతినిధులే కాకుండా, 100 మందికి పైగా పోలీసులున్నారు. ఆశ్రమానికి ఉన్న 50 అడుగుల ఎత్తైన ప్రహరీ గోడకు ఉన్న ఒక భారీ ద్వారాన్ని ధ్వంసం చేసేందుకు పోలీసులు తీసుకువచ్చిన ఒక జేసీబీ వాహనాన్ని స్వామీజీ అనుచరులు తగులబెట్టారు.
ఒక కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి స్వామి రాంపాల్‌పై బెయిల్‌కు వీల్లేని వారంటును జారీ చేసిన పంజాబ్, హర్యానా హైకోర్టు.. శుక్రవారంలోగా ఆయనను కోర్టుకు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. దాంతో పోలీసులు, పారా మిలటరీ బలగాలు మంగళవారం భారీ ఎత్తున స్వామీజీ ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. మీడియా కూడా భారీగా మోహరించింది. ఆశ్రమం లోపలికి వెళ్లి స్వామీజీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను రాంపాల్ అనుచరులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
స్వామి రాంపాల్ ప్రైవేట్ సైన్యం, ఆయన అనుచరులు పోలీసుల పైకి కాల్పులు జరిపారని.. యాసిడ్ సీసాలు, పెట్రోలు బాంబులు, రాళ్లతో దాడి చేశారని రాష్ట్ర డీజీపీ ఎస్‌ఎన్ వశిష్ట్ తెలిపారు. పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని వాటర్ కానన్లతో అడ్డుకున్నామన్నారు. వారి వద్ద పిస్టళ్లు, రివాల్వర్లు, ఇతర మారణాయుధాలు ఉన్నాయన్నారు. వారి దాడిలో చాలామంది పోలీసులు గాయాల పాలయ్యారని, ఒక ఏఎస్‌ఐ మెడలోకి బుల్లెట్ దూసుకుపోయిందని వివరించారు. పోలీసులు కూడా టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ కానన్లతో స్వామీ రాంపాల్ అనుచరులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆశ్రమం లోపల పెద్ద ఎత్తున మహిళలు, పసిపిల్లలు ఉన్నందున సంయమనంతో వ్యవహరిస్తున్నామన్నారు. ఆశ్రమం లోపల భారీగా ఎల్పీజీ సిలండర్లు కూడా ఉన్నందున మరింత జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఆశ్రమం లోనే ఉన్న రాంపాల్‌ను అదుపులోకి తీసుకునేంతవరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. విలేకరులపై పోలీసులు దాడి చేస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడంతో, ఆ విషయంపై విచారణ జరుపుతామని వశిష్ట్ తెలిపారు.
స్వామీజీ ఆరోగ్యం బాలేదు
పోలీసుల దాడిలో ఆశ్రమంలోని నలుగురు మహిళలు మరణించారని ఆశ్రమ ప్రతినిధి రాజ్‌కపూర్ ఆరోపించారు. స్వామీజీ అనారోగ్యంతో ఉన్నారని, ఒక రహస్య ప్రదేశంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. చట్టం నుంచి పారిపోయేందుకు స్వామీజీ ప్రయత్నించడం లేదని, ఆరోగ్యం బాగవగానే కోర్టులో హాజరవుతారన్నారు. మరోవైపు, ఆశ్రమంలో వేలాదిగా ప్రజలున్నారని, వారిని స్వామి రాంపాల్ అనుచరులు, ఆయన ప్రైవేటు సైన్యం బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటోందని.. మంగళవారం ఉదయం ఆశ్రమం నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన పలువురు వెల్లడించారు. పరిస్థితిని ముఖ్యమంత్రి ఎమ్‌ఎల్ ఖట్టర్ స్వయంగా సమీక్షిస్తున్నారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ, పీసీఐ ఖండనలు
ఆశ్రమం వద్ద మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడిని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్‌లు తీవ్రంగా ఖండించాయి. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ హర్యానా డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. కోర్టును, చట్టాన్ని గౌరవించాలని, అధికారులకు సహకరించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వామీజీ అనుచరులకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ విమర్శించింది.