rampal ashram
-
హత్య కేసుల్లో బాబా రాంపాల్‌కు జీవితఖైదు
చండీగఢ్ : రెండు హత్య కేసుల్లో దోషిగా తేలిన బాబా రాంపాల్‌కు హిసార్‌లోని సెషన్స్ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. రాంపాల్ అనుచరులు పదిహేను మందికి కూడా కోర్టు ఇదే శిక్ష విధించింది. మరో మహిళ హత్య కేసులో విధించే శిక్షను కోర్టు బుధవారం నిర్ధారించనుంది. బాబా రాంపాల్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో హిసార్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హిసార్‌లో సత్లోక్ ఆశ్రమ్‌ను స్ధాపించిన 67 ఏళ్ల రాంపాల్ రెండు హత్యలు, ఇతర నేరాల్లో దోషిగా నిర్ధారణ అయ్యారు. హిసార్ జిల్లా జైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయస్ధానంలో నాలుగేళ్ల పాటు విచారణ చేపట్టిన అనంతరం హిసార్ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి డీఆర్ చాలియా తుది తీర్పు వెల్లడించారు. నవంబర్ 2014లో అరెస్ట్ అయినప్పటినుంచి రాంపాల్ ఆయన అనుచరులు జైలు జీవితం గడుపుతున్నారు. 2014 నవంబర్ 19న రాంపాల్, ఆయన అనుచరులపై బర్వాలా పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. బర్వాలాలోని రాంపాల్ ఆశ్రమంలో బాబా, ఆయన అనుచరుల నిర్బంధంలో ఉన్న తమ భార్యలు హత్య గావించబడ్డారని వారి భర్తలు ఢిల్లీకి చెందిన శివపాల్, యూపీకి చెందిన సురేష్‌లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భారీ భద్రత డేరా బాబాను కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించిన క్రమంలో చెలరేగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని బాబా రాంపాల్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. హిసార్ జిల్లా అంతటా సెక్షన్ 144 విధించి 2000 మంది పోలీసులను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించామని జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ మీనా తెలిపారు. -
జంట హత్యల కేసులో దోషిగా తేలిన రాంపాల్
సాక్షి, న్యూఢిల్లీ : తనకు తాను స్వామీజీగా చెప్పుకునే రాంపాల్ బాబా రెండు హత్య కేసుల్లో దోషిగా తేలారు. హర్యానాలోని హిసార్ కోర్టు గురువారం ఆయనను జంట హత్యల కేసులో దోషిగా నిర్ధారించింది. ఈనెల 16, 17 తేదీల్లో ఆయనకు విధించే శిక్షను కోర్టు ఖరారు చేయనుంది. పెద్ద ఎత్తున శిష్యగణం కలిగిన రాంపాల్ ప్రస్తుతం హిసార్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నారు. తన అనుచరులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు మరణించడం, పలువరు గాయపడిన ఘటనకు సంబంధించి 2015 నవంబర్‌లో రాంపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్ధానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పును వెలువరించింది. తీర్పు నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు హిసార్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1800 మంది పోలీసులను నియోగించారు. 2017 ఆగస్ట్‌లో డేరా బాబాను దోషిగా తేల్చిన సందర్భంలో పంచ్కులలో చెలరేగిన ఘర్షణలు పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. రాంపాల్ అనుచరులు హిసార్లోకి ప్రవేశించకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. -
రాంపాల్ ఆశ్రమంలో రహస్యాలపై విచారణ
బర్వాలా: హర్యానా పోలీసులు ఆదివారం వివాదాస్పద స్వామి రాంపాల్‌ను విచారణ నిమిత్తం ఆయన ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆశ్రమంలో రాంపాల్, ఆయన శిష్యుల రహస్య కార్యకాలపాల గురించి పోలీసులు విచారిస్తున్నారు. హిసార్ జిల్లాలోని బర్వాల పట్టణానికి సమీపంలో 12 ఎకరాల విస్తీర్ణంలో రాంపాల్ ఆశ్రమం ఉంది. బుధవారం రాంపాల్‌ను అరెస్ట్ చేసి దేశ ద్రోహం సహా పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాంపాల్ అనుచరులకు, పోలీసులకు మధ్య జరిగిన దాడుల్లో ఆరుగురు మరణించారు. రాంపాల్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. రాంపాల్ ఆశ్రమంలో గురువారం నుంచి ప్రత్యేక విచారణ బృందం సోదాలు కొనసాగిస్తోంది. ఆశ్రమంలో రహస్య కార్యకలాపాలపైనా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే గర్భ నిర్ధారణ పరీక్షల కిట్లు లభ్యంకాగా, పెద్ద ఎత్తున లాకర్లు, కర్రలను దాచినట్టు గుర్తించారు. ప్రత్యేక బృందానికి సహకరించేందుకుగాను పోలీసులు రాంపాల్‌ను ఆశ్రమానికి తీసుకెళ్లారు. చదవండి (స్వామి రాంపాల్ అరెస్ట్) (రాంపాల్ కు ఈనెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ) (రాంపాల్ ఆశ్రమంలో గర్భనిర్ధారణ కిట్లు!!) -
రాంపాల్ ఆశ్రమంలో గర్భనిర్ధారణ కిట్లు!!
హర్యానాలో వివాదాస్పద బాబా రాంపాల్ ఆశ్రమం మీద పోలీసులు దాడిచేసి, ఆయన్ను అరెస్టు చేసినప్పుడు అక్కడ దొరికిన వస్తువుల జాబితాలో ఏవేం ఉన్నాయో తెలుసా? రివాల్వర్లు, మిరపకాయ బాంబులు.. వాటితో పాటు గర్భనిర్ధారణ కిట్లు! బల్వారాలోని సత్లోక్ ఆశ్రమంలో గల రాంపాల్ వ్యక్తిగత గదిలో కూడా ఇలాంటి ఓ కిట్ బయటపడింది. రాంపాల్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించే స్థలానికి కింద సొరంగం లాంటి గది ఒకటుంది. అందులో మూడు .32 బోర్ రివాల్వర్లు, 19 ఎయిర్గన్లు, రెండు .12 బోర్ రైఫిళ్లు, రెండు .315 బోర్ రైఫిళ్లు, మిర్చి గ్రెనేడ్లు, వాటి క్యార్ట్రిడ్జిలు కూడా ఆశ్రమంలో ఉన్నాయి. భారీమొత్తంలో ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా కనిపించాయి. రెండు పెద్ద వాటర్ ట్యాంకులు కూడా ఆశ్రమ ప్రాంగణంలో కనిపించాయి. ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సుమారు 865 మందిని అరెస్టు చేశామని, వాళ్లలో ఎవరైనా నక్సలైట్లు కూడా ఉన్నారేమో పరిశీలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక రాంపాల్ అయితే.. జైల్లో ఎవరితోనూ మాట్లాడటంలేదు. గత రాత్రి మొత్తం ఆయన ఏమీ తినలేదు, తాగలేదు. పూర్తి నిరాహారదీక్ష పాటిస్తున్నారు. శుక్రవారం ఉదయం రెండుసార్లు టీ తాగారు, గురువారం నాటి మధ్యాహ్నం నాలుగు చపాతీలు పప్పుతో తిన్నారు. ఆ తర్వాత పూర్తి నిరాహారంగానే ఉన్నారు. -
స్వామీజీ అరెస్ట్‌పై టెన్షన్!
వివాదాస్పద స్వామి రాంపాల్ ఆశ్రమం వద్ద ఘర్షణలు బర్వాలా(హర్యానా): హర్యానాలో వివాదాస్పద స్వామీజీ రాంపాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ హింసాత్మకంగా మారింది. బర్వాలా పట్టణంలోని స్వామీజీ ఆశ్రమం వద్ద ఆయన అనుచరులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో 200 మంది గాయపడ్డారు. వారిలో స్వామీజీ అనుచరులు, మీడియా ప్రతినిధులే కాకుండా, 100 మందికి పైగా పోలీసులున్నారు. ఆశ్రమానికి ఉన్న 50 అడుగుల ఎత్తైన ప్రహరీ గోడకు ఉన్న ఒక భారీ ద్వారాన్ని ధ్వంసం చేసేందుకు పోలీసులు తీసుకువచ్చిన ఒక జేసీబీ వాహనాన్ని స్వామీజీ అనుచరులు తగులబెట్టారు. ఒక కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి స్వామి రాంపాల్‌పై బెయిల్‌కు వీల్లేని వారంటును జారీ చేసిన పంజాబ్, హర్యానా హైకోర్టు.. శుక్రవారంలోగా ఆయనను కోర్టుకు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. దాంతో పోలీసులు, పారా మిలటరీ బలగాలు మంగళవారం భారీ ఎత్తున స్వామీజీ ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. మీడియా కూడా భారీగా మోహరించింది. ఆశ్రమం లోపలికి వెళ్లి స్వామీజీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను రాంపాల్ అనుచరులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వామి రాంపాల్ ప్రైవేట్ సైన్యం, ఆయన అనుచరులు పోలీసుల పైకి కాల్పులు జరిపారని.. యాసిడ్ సీసాలు, పెట్రోలు బాంబులు, రాళ్లతో దాడి చేశారని రాష్ట్ర డీజీపీ ఎస్ఎన్ వశిష్ట్ తెలిపారు. పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని వాటర్ కానన్లతో అడ్డుకున్నామన్నారు. వారి వద్ద పిస్టళ్లు, రివాల్వర్లు, ఇతర మారణాయుధాలు ఉన్నాయన్నారు. వారి దాడిలో చాలామంది పోలీసులు గాయాల పాలయ్యారని, ఒక ఏఎస్ఐ మెడలోకి బుల్లెట్ దూసుకుపోయిందని వివరించారు. పోలీసులు కూడా టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ కానన్లతో స్వామీ రాంపాల్ అనుచరులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆశ్రమం లోపల పెద్ద ఎత్తున మహిళలు, పసిపిల్లలు ఉన్నందున సంయమనంతో వ్యవహరిస్తున్నామన్నారు. ఆశ్రమం లోపల భారీగా ఎల్పీజీ సిలండర్లు కూడా ఉన్నందున మరింత జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఆశ్రమం లోనే ఉన్న రాంపాల్‌ను అదుపులోకి తీసుకునేంతవరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. విలేకరులపై పోలీసులు దాడి చేస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడంతో, ఆ విషయంపై విచారణ జరుపుతామని వశిష్ట్ తెలిపారు. స్వామీజీ ఆరోగ్యం బాలేదు పోలీసుల దాడిలో ఆశ్రమంలోని నలుగురు మహిళలు మరణించారని ఆశ్రమ ప్రతినిధి రాజ్‌కపూర్ ఆరోపించారు. స్వామీజీ అనారోగ్యంతో ఉన్నారని, ఒక రహస్య ప్రదేశంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. చట్టం నుంచి పారిపోయేందుకు స్వామీజీ ప్రయత్నించడం లేదని, ఆరోగ్యం బాగవగానే కోర్టులో హాజరవుతారన్నారు. మరోవైపు, ఆశ్రమంలో వేలాదిగా ప్రజలున్నారని, వారిని స్వామి రాంపాల్ అనుచరులు, ఆయన ప్రైవేటు సైన్యం బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటోందని.. మంగళవారం ఉదయం ఆశ్రమం నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన పలువురు వెల్లడించారు. పరిస్థితిని ముఖ్యమంత్రి ఎమ్ఎల్ ఖట్టర్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఎన్హెచ్ఆర్సీ, పీసీఐ ఖండనలు ఆశ్రమం వద్ద మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడిని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్లు తీవ్రంగా ఖండించాయి. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ హర్యానా డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. కోర్టును, చట్టాన్ని గౌరవించాలని, అధికారులకు సహకరించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వామీజీ అనుచరులకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ విమర్శించింది.