
డేరా ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేసిన పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ : తనకు తాను స్వామీజీగా చెప్పుకునే రాంపాల్ బాబా రెండు హత్య కేసుల్లో దోషిగా తేలారు. హర్యానాలోని హిసార్ కోర్టు గురువారం ఆయనను జంట హత్యల కేసులో దోషిగా నిర్ధారించింది. ఈనెల 16, 17 తేదీల్లో ఆయనకు విధించే శిక్షను కోర్టు ఖరారు చేయనుంది. పెద్ద ఎత్తున శిష్యగణం కలిగిన రాంపాల్ ప్రస్తుతం హిసార్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నారు. తన అనుచరులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు మరణించడం, పలువరు గాయపడిన ఘటనకు సంబంధించి 2015 నవంబర్‌లో రాంపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్ధానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పును వెలువరించింది. తీర్పు నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు హిసార్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1800 మంది పోలీసులను నియోగించారు.
2017 ఆగస్ట్‌లో డేరా బాబాను దోషిగా తేల్చిన సందర్భంలో పంచ్‌కులలో చెలరేగిన ఘర్షణలు పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. రాంపాల్ అనుచరులు హిసార్‌లోకి ప్రవేశించకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.